BDK: PDSU, PYL ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన స్ఫూర్తియాత్ర ఇవాళ భద్రాచలం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ముగిసింది. PDSU అధ్యక్షుడు కాంపాటి పృధ్వీ మాట్లాడుతూ.. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై సమరశీల పోరాటాలకు రూపకల్పన చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ సవరించి కనీసం 20 శాతం నిధులు మంజూరు చేయాలన్నారు.
ASR: జీ.మాడుగుల మండలంలో ఆదివాసి సత్యాగ్రహ యాత్ర 136వ రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా పెదలోచలి, గొడుగుమమిడి, వంతల గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలు నిర్వహించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగాల నియామకానికి ప్రత్యేక చట్టం చేయాలని ఆదివాసి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
VSP: వరకట్న వేధింపుల నిర్మూలనపై విశాఖలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సన్యాసినాయుడు మాట్లాడుతూ.. వరకట్నం సమాజానికి చీడ అని, మహిళలు చట్టపరమైన హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం అధికారులు మహిళా రక్షణ చట్టాల గురించి వివరించారు.
విజయనగరం బార్ అసోసియేషన్ సభ్యుడు, ప్రముఖ సీనియర్ న్యాయవాది కోలగట్ల తమన్న శెట్టి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. విజయనగరంలోని ఆయన స్వగృహంలో మృతి చెందినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి స్వయాన సోదరుడైన తమన్న శెట్టి మృతి పట్ల న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, సన్నిహితులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
KMM: నగరంలోని స్ధానిక బస్ డిపో రోడ్‌లో ఉన్న జిల్లా గ్రంథాలయంలోని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. ఈ మేరకు జిల్లా గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాఠకులకు, విద్యార్దులకు అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. ఈ తనిఖీ సందర్భంలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీజ ఉన్నారు.
NRML: శ్రీరామ నవమి శోభాయాత్రల బందోబస్తుపై జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పహారా, సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రూట్ మ్యాప్స్ ముందుగానే ఖరారు చేసి, ట్రాఫిక్ నియంత్రణ కట్టుదిట్టంగా అమలు చేయాలని వారు సిబ్బందికి సూచించారు.
WG: పెనుమంట్రలో 221 ఏళ్ల పురాతన శ్రీరామాలయంలో బుధవారం ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొనేందుకు పెనుమంట్ర, బ్రాహ్మణచెరువు, గరువు, నత్తరామేశ్వరం, జుత్తిగ తదితర పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
NGKL: చారకొండ మండలంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరసనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ఏవో ఆంజనేయులు తెలిపారు. ఈనెల 26 నుంచి ఏప్రిల్ 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 27న సీతారాముల మహా కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు.
MBNR: సీసీకుంట మండలం అమ్మాపురం గ్రామంలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో ఇవాళ హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో రూ.9,37,740 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ELR: అనకాపల్లి జిల్లా చందనాడ పంచాయతీ పరిధిలో ఏర్పాటవుతున్న స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిలో ఈ ఉక్కు కర్మాగారం వల్ల ఎంతో మందికి ఉపాధి జరుగుతుందన్నారు.
తిరుపతి: విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు చేయూతనందించారు. హోంగార్డు రమేష్ బాబు భార్య వసంతమ్మకు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ అపాయింట్‌మెంట్ లేఖ అందజేశారు. అలాగే ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో ఇచ్చారు.
MDCL: దివ్యాంగులకు నెలకు రూ. 6 వేల పెన్షన్ హామీని వెంటనే అమలు చేయాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి, హామీ అమలు కాకపోవడంపై నిరసన తెలిపారు. పలుమార్లు వినతులు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. దివ్యాంగుల హక్కుల చట్టం అమలులోనూ నిర్లక్ష్యం ఉందని పేర్కొంటూ అమలు చేయాలని కోరారు.
MBNR : పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో టీబీ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీబీ జిల్లా ఆఫీసర్ మల్లికార్జున్ మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో పీయూ, ఎన్ఎస్ఎస్ అధికారులు ప్రవీణ, అర్జున్, రవికాంత్, ఈశ్వర్, గాలన్న చిన్నదేవి పాల్గొన్నారు.
TG: ఎక్సైజ్ శాఖ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లులోని లోపాలను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎత్తిచూపగా మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు. అయితే, నెలవారీ వసూళ్ల ప్రస్తావన లేకుండా బిల్లును ఎలా పాస్ చేస్తారని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో సభలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం (21) హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. భక్తులు స్వామివారికి, అమ్మవారికి సమర్పించిన కానుకలను లెక్కించారు. ఈ క్రమంలో స్వామి వారి హుండీ ఆదాయము రూ.23,17,756 రాగా, అమ్మవారి హుండీ ఆదాయము రూ.7,05,042 వచ్చింది. మొత్తం రూ. 30,22,798 వచ్చినట్లు అధికారులు తెలిపారు.