హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని హుబ్బళ్లికి బయల్దేరిన ‘ఫ్లై91’ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ విమానాన్ని దారిమళ్లించారని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విమానం దాదాపు మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో వణికిపోయిన కొందరు కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం.