విరాట్ కోహ్లీ, చేతేశ్వర పూజారాలపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ ఆస్ట్రేలియాకు పెనుసవాలుగా మారనున్నారని అన్నారు. జూన్ 7న లండన్ లో జరుగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (World Test Championship ) WTC 2021-23 ఫైనల్ లో భారత్ – ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. విరాట్, పుజారాలు ప్రస్తుతం మంచి ఫామ్ ను కనబరుస్తున్నారని, వీరిరువురుతోనే ఆస్ట్రేలియాకు ముప్పు ఉందన్నారు. ఆస్ట్రేలియా జట్టు తప్పకుండా విరాట్, పూజారాలను ఎదుర్కోవడానికి కచ్చితంగా వ్యూహాలు పన్నే ఉంటారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పాంటింగ్.
గతంలో విరాట్, పూజారాలు ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆసిస్ పై 24 మ్యాచ్ లు ఆడిన పూజారా 50.82 సగటుతో 2వేల33 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లీ ఆసీస్ పై 23 మ్యాచ్ లు ఆడగా 59.95 సగటుతో 1199 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. విరాట్ ప్రస్తుతం తన అత్యత్తమ ప్రదర్శనను చేస్తున్నాడని రికీ పాంటింగ్ చెప్పాడు. ఇది ఒక రకంగా ఆస్ట్రేలియాకు హెచ్చరిక లాంటిదని అన్నారు. కోహ్లీ టీ20, వన్డేలనే తేడా లేకుండా తన సత్తాను చాటుతున్నారన్నారు. IPL 2023లో కోహ్లీ 14 ఔటింగ్ లలో 639 పరుగులు సాధించగా, అందులో ఆరు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలతో వీరవిహారం చేసినట్లు పాంటింగ్ చెప్పాడు.
WTC ఫైనల్ కు ముందు శుబ్ మాన్ గిల్ గురించి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గిల్ మంచి ఫామ్ ను కనబరుస్తున్నాడని అయితే అతనికి కొంచెం అహంకారం ఉందని అన్నాడు. IPL 2023లో గిల్ బ్యాటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నాడని చెప్పాడు. గిల్ అద్భుతమైన యువడు, ఫాస్ట్ బౌలర్లపై అతడు ఆడే ఫ్రంట్ – ఫుట్ పుల్ షాట్ అద్భుతమని రికీ కొనియాడారు. ప్రస్తుత భారత ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నందున ఆస్ట్రేలియాకు పెను సవాలు ఖాయమని అన్నాడు.