ప్రపంచ ఆకలి సూచీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్(Hunger Index) విడుదల చేసిన నివేదికలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ (Bangladesh) కంటే భారత్ తక్కువ ర్యాంకులో నిలిచింది. భారత్‌లో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారంటూ తాజాగా విడుదలైన నివేదికను భారత్ ఖండించింది. ఇలాంటివి దేశ ప్రతిష్ఠను దిగజారుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సూచి వాస్తవాన్ని ప్రతిఫలించట్లేదని వ్యాఖ్యానించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2023ను విడుదల చేశారు.
మొత్తం 125 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ (India) చివరన 111వ స్థానంలో నిలిచింది. అంతేకాదు, గతేడాది 121 దేశాలతో కూడిన జాబితాలో భారత్‌కు 107వ ర్యాంకు దక్కింది. ప్రస్తుతం మన దేశంలో 28.7గా ఉన్న ఆకలి సూచి.. ప్రజలు తిండిలేక అలమటిస్తున్నారన్న విషయాన్ని సూచిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం, భారత్‌లో చిన్నారులు పోషకాహార లోపం(Malnutrition)తో కూడా సతమతమవుతున్నారు. ఇది ఏకంగా 18.7 శాతంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. దేశంలో ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు 3.1 శాతంగా ఉంది. అలాగే 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో రక్తహీనత 58.1 శాతంగా ఉంది.
మరోవైపు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో దాయాదిదేశం పాక్ 102 స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ 81వ స్థానం, నేపాల్ 69వ స్థానం, శ్రీలంక (Sri Lanka) 60వ స్థానంలో.. భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్టు ఈ నివేదిక తేల్చింది. దేశంలోని వాస్తవ పరిస్థితులను ఇది ప్రతిబింబించడం లేదని తేల్చి చెప్పింది. ఈ సూచిక ముదింపులో ఉపయోగించిన నాలుగు ప్రాతిపదికల్లో మూడు చిన్నారులకు సంబంధించినవని, కాబట్టి ఇది యావత్ దేశంలోని సగటు పరిస్థితులను ప్రతిబింబించలేదని వివరించింది.