బంగారం వ్యాపారంలో లలితా జ్యువెలర్స్ ధోరణి భిన్నం. ప్రజలను ఆకర్షించడంలో లలితా జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్ ప్రత్యేకత చాటుతున్నారు. ‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్ తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలకు మారుపేరైన కిరణ్ కుమార్ వ్యాపారం విజయవంతంగా సాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో తన స్టోర్లను పెంచుకుంటూ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు. అయితే తన విజయం వెనుక ఒకరు ఉన్నారని తెలిపారు. తనకు వ్యాపారం కలిసి రావడానికి.. ఇంత స్థాయికి ఎదగడానికి కారణం మహానటి సావిత్రి అని ప్రకటించాడు. ఇటీవల ఓ చానల్ ఇంటర్వ్యూలో కిరణ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపాడు. అయితే సావిత్రితో కిరణ్ కుమార్ కు సంబంధం ఏమిటీ? లలితా జ్యువెలర్స్ ఇంతలా సక్సెస్ కావడానికి కారణాలేమిటో ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
చెన్నైలో కిరణ్ కుమార్ మొదట బంగారం వ్యాపారం మొదలుపెట్టాడు. సినీనటి సావిత్రికి చెందిన ఇంటిని ఆమె పిల్లలు కూల్చివేసి వాణిజ్య భవనం నిర్మించారు. ఆ భవనంలో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకుని కిరణ్ కుమార్ వ్యాపారం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి వ్యాపారంలో రాణించాడు. అనంతరం లలితా జ్యువెలర్స్ ప్రస్థానం మొదలైంది. తన వ్యాపారం విజయవంతం కావడానికి గల కారణం సావిత్రి గారి ఆశీర్వాదం ఉండడమేనని కిరణ్ కుమార్ ఇంటర్వ్యూలో తెలిపారు. వ్యాపారంలో సక్సెస్ అయ్యాక ఆ భవనాన్ని తానే కొనుగోలు చేసినట్టు చెప్పారు. సావిత్రిపై అభిమానంతో భవనంపైన ఇంకా సావిత్రి గణేశన్ పేరు అలానే ఉంచామని వివరించారు. ఇలా తన సక్సెస్ కు సావిత్రి మంత్రం పని చేసిందని లలితా జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్ చెప్పుకొచ్చారు.