విశాఖను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ అన్నారు. జీవీఎంసీ అధికారులతో జరిగిన సమీక్షలో నగర అభివృద్ధి, పరిశుభ్రత, మౌలిక వసతులపై దృష్టి సారించాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో అగ్రస్థానం సాధించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
GNTR: దుగ్గిరాల(M) చిలువూరు వద్ద గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మంగళగిరి రూరల్ సీఐ బ్రహ్మం, దుగ్గిరాల ఎస్సై రవి ఆధ్వర్యంలో మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.8 కిలోల గంజాయి, ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
NLR: మార్కాపురం వద్ద ఇటీవల బస్సు టిప్పర్‌ను ఢీకొని దగ్ధమైన ఘటనలో 14 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం అధికారులు జిల్లాలోని ASపేటలో పలు ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సీఐ గంగాధర్, ఎస్సై సైదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
CTR: చిత్తూరు గంగినేని పార్క్ వద్ద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ శుక్రవారం ప్రారంభించారు. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా పాదాచారులు, ప్రయాణికుల దాహార్తి తీర్చేలా చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన తెలియజేశారు. అనంతరం పలువురికి పండ్లను పంపిణీ చేశారు.
W.G: కేరళ మాదిరిగా విద్య, వైద్యం బాధ్యతను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకోవాలని పెంటపాడు సీపీఎం పార్టీ కన్వీనర్ రంగారావు డిమాండ్ చేశారు. శుక్రవారం పెంటపాడు ప్రజాసంఘాల కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 సార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరిచి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.
ATP: అనంతపురం, సత్యసాయి జిల్లాల నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని APSPDCL CMD శివశంకర్ లోతేటి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి హ్యాండ్ లూమ్స్‌కు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చింది. సంస్థ పరిధిలోని 41 వేల మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఏటా రూ.25.56 కోట్ల సబ్సిడీ భరిస్తోందని ఆయన తెలిపారు.
SS: మడకశిరలోని బీసీ బాలికల వసతి గృహానికి సుంగ్వూ హైటెక్ సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్ టీవీని శుక్రవారం విరాళంగా అందజేశారు. విద్యార్థినుల ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించేందుకు ఈ స్మార్ట్ టీవీ అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా. డి. శ్రీనివాస్ మూర్తి, డా. కృష్ణమూర్తి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
KRNL: ఆదోనిలో తుంగభద్ర కాలువ నుంచి మూడు రోజుల్లో నీరు రానున్న నేపథ్యంలో ఇవాళ బసాపురం ఎస్‌ఎస్ ట్యాంక్‌ను గుడిసె ఆది కృష్ణమ్మ పరిశీలించారు. ఎండాకాలంలో తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ట్యాంక్ మరమ్మత్తులు, నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ముందస్తు ప్రణాళికతో ప్రజల అవసరాలు తీర్చాలని పేర్కొన్నారు.
KDP: సిద్ధవటం(M) మాధవరం-1 గ్రామంలో పట్టపగలే వీధి దీపాలు వెలిగిపోతూ విద్యుత్ వృథా అవుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. పగటి సమయంలో కూడా లైట్లు ఆపకపోవడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ వృథాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నంద్యాలలో రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ జిల్లా సమావేశం శుక్రవారం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో 11వ పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు గడిచినా 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కమిషన్ నియమించాలని నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
ELR: అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ నాగ ప్రభు కుమార్ శుక్రవారం జంగారెడ్డిగూడెం, పోలవరం ఎక్సైజ్ స్టేషన్‌లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్లలో ఉన్న రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నాటు సారాయికి సంబంధించిన సమాచారం సేకరించాలని అలాగే తెలంగాణ ఇతర రాష్ట్రలా నుంచి సుంకం చెల్లించని మద్యం రవాణాపై నిఘా ఉంచాలన్నారు.
నెల్లూరు ఉమ్మారెడ్డి గుంటకు చెందిన వాణికి శుక్రవారం పురిటినొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు బాధితురాలికి అంబులెన్స్‌లో వాహనంలో ప్రథమ చికిత్స అందించి మార్గమధ్యంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రసవం చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నట్లు సిబ్బంది పేర్కొన్నారు.
VSP: ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ‘సృజన’ మూడురోజుల వర్క్‌షాప్, ఎగ్జిబిషన్ కార్యక్రమం విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అతిథులు విద్యార్థుల ఆవిష్కరణలను ప్రారంభించి, ఇలాంటి వేదికలు సృజనాత్మకతకు దోహదమని పేర్కొన్నారు.
CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులకు వైసీపీ ఉల్లంఘన నోటీసు జారీ చేసింది. మూడు రోజులకు ముందు ఆయన తన నివాసంలో ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఎంపీపీలకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్తను పిలవకపోవడం, 2029లో పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి తానే అంటూ బహిరంగంగా ప్రకటించడం పార్టీ హై కమాండ్ దృష్టికి వచ్చింది.
కనిగిరిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా కాశిరెడ్డి కాలనీలోని హోసన్న కల్వరి కృప ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ.. యేసుక్రీస్తు చేసిన త్యాగం, నిస్వార్థ ప్రేమను స్మరించుకోవాల్సిన పవిత్ర దినమని తెలిపారు. సమాజంలో ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందాలని ఆకాంక్షించారు.