ASR: చింతాలమ్మ ఘాట్‌లోని మూడో మలుపు ప్రమాదకరంగా మారింది. కృష్ణాదేవిపేట–కాకరపాడు మధ్య జాతీయ రహదారి 516లో ఈ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో నాలుగు ప్రమాదాలు నమోదయ్యాయి. తక్షణమే అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
TPT: బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై నిన్న రాత్రి చోటుచేసుకుంది. కలువాయికి చెందిన రమేశ్ మల్లాంలో వివాహ వేడుకకు వెళ్తుండగా మార్గమధ్యలో మనుబోలు జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొనడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AKP: నక్కపల్లిలో ఈనెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరిగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. బహిరంగ సభ ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని 13వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బండారు సత్యనారాయణ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. వైద్యం, మందుల ఖర్చుల కోసం రూ.10,000 చెక్కు రూపంలో ఆర్థిక సహాయం అందించారు.
ELR: బాలికను మాయమాటలతో నమ్మించి సహజీవనం చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్రపై దెందులూరు పోలీసులు పోక్సో, అత్యాచార కేసులు నమోదు చేశారు. వీరు కొన్నాళ్లుగా దోసపాడులో అక్వా చెరువుల వద్ద కాపలాకు ఉంటున్నారు. నాగ్‌పూర్ వెళ్లేందుకు ఏలూరు రైల్వే స్టేషన్‌కు రాగా, అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు.
KKD: గండేపల్లి మండలం రామయ్య పాలెంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. సినిమా చూసి బైక్‌పై వస్తున్న చందు, మణికంఠ, కిషోర్‌లు ఆటోను తప్పించే క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో చందు అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
W.G: నరసాపురానికి చెందిన ప్రముఖ కళాకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. శిల్ప, చిత్ర, సూక్ష్మ కళా రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికిగాను విజయవాడలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. గతంలో గిన్నిస్ రికార్డు సాధించిన విజయ్ మోహన్‌ను పలువురు ప్రముఖులు అభినందించారు.
సత్యసాయి: తనకల్లు మండలం మండ్లిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న పత్తి లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స కోసం తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
E.G: నార్త్ జోన్ ఇన్‌ఛార్జ్ రామకృష్ణ ఆదేశాల మేరకు కోరుకొండ సీఐ మూర్తి ఆధ్వర్యంలో గ్రామాల్లో శాంతి భద్రత కోసం అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ గురువారం తెలిపారు. కోరుకొండ, గోకవరం మండలాల్లో జరుగుతున్న జాతరల్లో జూదాలు, అసాంఘిక కార్యకలాపాలు, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కమిటీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రకాశం: జరుగుమల్లి మండలం దావగూడూరుకు చెందిన బత్తిన శ్రీకాంత్ అనే దివ్యాంగుడికి 3 చక్రాల వాహనాన్ని మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో గురువారం అందజేశారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం 100% రాయితీతో ఉచితంగా 3 చక్రాల మోటారు వాహనాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటోందన్నారు. నాయకులు బ్రహ్మేంద్రం, బత్తిన బ్రహ్మయ్య, వెంకట సుబ్బయ్య, పాల్గొన్నారు.
CTR: చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్న అన్ని రైళ్లను ఆపాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు చిత్తూరు రైల్వే స్టేషన్ ఇంఛార్జ్ సూపరింటెండెంటుకు నిన్న వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ.. చిత్తూరు నుంచి డైరెక్ట్‌గా చెన్నైకి రైలు వేయాలని, చిత్తూరు స్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలన్నారు.
VZM: శృంగవరపుకోట మండలంలోని ఎందుర్తి-బొడ్డవర జాతీయ రహదారి నుంచి దబ్బగుంట వరకు రహదారి గుంతలతో అధ్వాన్నంగా మారింది. కాపుసోంపురం మీదుగా వెళ్లే సుమారు 4 కి.మీ మార్గం దెబ్బతినగా, గురువారం వర్షంతో పలుచోట్ల నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు.
NDL: ఉగాది ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు నందవరం చౌడేశ్వరి మాత భక్తులకు విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్లు పీవీ కుమార్ రెడ్డి, పీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వేదమంత్రోచ్చారణల మధ్య కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహామంగళహారతి, విశేష పూజలు చేశారు.
పల్నాడు: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన నకరికల్లు మండలం అడ్డరోడ్డు వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు ఆయనకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
PPM: ఉగాది పండుగ సందర్భంగా జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కే.కృష్ణమూర్తి కురుపాం మండలంలోని నీలకంఠపురం పంచాయతీ దండి సూర గ్రామంలో నిరుపేద గిరిజన మహిళకు ఓ రైస్ బ్యాగ్, బట్టలు పంపిణీ చేశారు. దానితోపాటు కొత్తవలస నాయి బ్రాహ్మణ వీధిలో 30 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. దాతకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.