• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులపై మంత్రి సవిత సమీక్ష

సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఇప్పటికే 61 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 73 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు ఆమె వెల్లడించారు. అలాగే 220 గోకులం షెడ్లు, 139 నీటి తొట్టీల పనులు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ పీడీ విజయేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

April 18, 2026 / 07:24 AM IST

కేజీబీవీలో మెగా ఆయుర్వేద శిబిరం

PLD: రాజుపాలెం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఆర్.శ్రీనివాస్ బృందం విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు చేసి, వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సుమారు 216 మంది విద్యార్థినులకు, సిబ్బందికి ఎంఈవో నరసింహారావు చేతుల మీదుగా ఉచితంగా ఆయుష్ మందులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

April 18, 2026 / 07:23 AM IST

‘టీనేజీ ప్రెగ్నెన్సీపై యువతకు అవగాహన తప్పనిసరి’

PPM: టీనేజ్‌ ప్రెగ్నెన్సీ వలన కలిగే అనర్దాలపై శుక్రవారం కలెక్టరేట్‌లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పాల్గొని కౌమార దశలో గర్భధారణ – దుష్ప్రభావాలపై పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం, గర్భం దాల్చడం వంటి విషయాలపై యువతకు అవగాహన తప్పనిసరని అన్నారు.

April 18, 2026 / 07:20 AM IST

నేడు విశాఖకు నాగాలాండ్ సీఎం రాక

VSP: నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో శనివారం రాత్రి విశాఖపట్నం నగరానికి రానున్నారు. ఆయన ఈ నెల 26వ తేదీ వరకు రుషికొండలోని Pema Wellness Resort లో బస చేయనున్నారు. అనంతరం 27వ తేదీన నాగాలాండ్‌కు తిరిగి బయలుదేరి వెళతారని అధికారులు వెల్లడించారు. ఆయన పర్యటన సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

April 18, 2026 / 07:20 AM IST

‘ పిల్లలను ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలి’

ASR: పిల్లలు ఫోన్లు, టీవీలకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని కొయ్యూరు CDPO సత్యవతి సూచించారు. శుక్రవారం డౌనూరు సచివాలయంలో జరిగిన ‘పోషణ పక్వాడ’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యనందిస్తున్నామని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు.

April 18, 2026 / 07:17 AM IST

‘గ్రామాలలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి’

VZM: శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం గరివిడిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక YCP క్యాంపు కార్యాలయంలో 4 మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఒకొక్కరితో మాట్లాడి వారి సమస్యలు, బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

April 18, 2026 / 07:17 AM IST

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం 6 మండలాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంగవరంలో 41.2, రొంపిచెర్లలో 41.1, శ్రీరంగరాజపురంలో 40.1, తవణంపల్లెలో 40.9, విజయపురంలో 40.5, బంగారుపాళ్యంలో 40.0, నగరి, నిండ్రలో 39.8, పులిచెర్ల, శాంతిపురంలో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.

April 18, 2026 / 07:14 AM IST

‘జలహారతి’ పనులపై కలెక్టర్ సమీక్ష

మార్కాపురం జిల్లా కనిగిరిలో ‘జల ధార-జల హారతి’ పనులపై నిర్లక్ష్యం వహించిన అధికారులను కలెక్టర్ విజయ సునీత హెచ్చరించారు. 6 మండలాల్లోని 134 చెరువుల పనులపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పూడిక తీత పనులను వేగవంతం చేయాలని సూచించారు. త్వరగా పనులు పూర్తి చేస్తే వర్షాకాలంలో చెరువులు నిండుతాయని తెలిపారు.

April 18, 2026 / 07:13 AM IST

నేడు బలగ ఐటీఐలో ఉద్యోగ మేళా

SKLM శ్రీకాకుళంలోని బలగ ప్రభుత్వ ఐటీఐలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కె. సుధ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉ. 10 గంటలకు హాజరుకావాలని అన్నారు. వివిధ సంస్థల్లో 345 ఉద్యో గాలను భర్తీ చేయనున్నట్లు , ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.

April 18, 2026 / 07:04 AM IST

‘విదార్థులకు దాతల సహకారం అవసరం’

NDL: బనగానపల్లె జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఫినిటీ పిన్ కార్డ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రూ.4,16,000 విలువైన ఐరన్ డెస్కులు, ప్లాస్టిక్ కుర్చీలు, విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. బీసీ ఇందిరా రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యాసానికి ఇలాంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

April 18, 2026 / 07:01 AM IST

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పెద్దపులి సంచారం

ELR: పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో 6 రోజులుగా సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా పులి కదలికలను గుర్తిస్తూ, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ డ్రోన్లు, ట్రాంక్విలైజర్ గన్లతో గాలింపు చేపడుతోంది. పులికి హాని కలగకుండా త్వరలోనే బంధిస్తామని, అప్పటివరకు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

April 18, 2026 / 07:00 AM IST

25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

KKD: ఈ నెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో తిప్పేనాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

April 18, 2026 / 07:00 AM IST

నేడు రావులపాలెంలో విద్యుత్‌కి అంతరాయం

కోనసీమ: రావులపాలెంలో 11కేవీ లైన్ ట్రీ కటింగ్, క్లియరెన్స్ పనుల నిమిత్తం శనివారం ఈతకోట, పొడగట్లపల్లి, లక్ష్మి పోలవరం, గోపాలపురం, రావులపాడు, ఊబలంక గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు పేర్కొన్నారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

April 18, 2026 / 07:00 AM IST

19న MJP ఇంటర్ ప్రవేశ పరీక్ష

ATP: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 19న పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ అస్రత్ వలి తెలిపారు. కొనకొండ్ల, నార్పలలోని కళాశాలల్లో ప్రవేశాల కోసం జిల్లా వ్యాప్తంగా 776 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు.

April 18, 2026 / 07:00 AM IST

విశాఖకు చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

VSP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం రాత్రి విశాఖపట్నం నగరానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు నగర డీసీపీ మేరీ ప్రశాంతి, విశాఖ ఆర్డీవో శేషశైలజ, గోపాలపట్నం తహశీల్దారు రమేష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి శనివారం ఎండాడలో నిర్మించనున్న జ్యుడిషియల్ అతిథిగృహానికి శంకుస్థాపన చేయనున్నారు.

April 18, 2026 / 07:00 AM IST