KRNL: జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 852 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. 27,571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 26,718 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
ELR: ఉంగుటూరు MLA క్యాంపు కార్యాలయంలో బుధవారం MLA పత్సమట్ల ధర్మరాజు అధ్యక్షతన గణపవరం మండల నాయకులతో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ.. రేపటి నుంచి ప్రారంభమవుతున్న ప్రారంభమవుతున్న 5వ విడత జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు వల్ల కార్యకర్తలకు కలిగే ప్రయోజనాలు వివరించారు.
W.G: పెనుగొండ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి పని తీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పురోగతిపై సమీక్షించారు. సర్వే నత్త నడకన సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం జేశారు. రెండు రోజుల్లో టార్గెట్ పూర్తి చేయాలంటూ ఆమె ఆదేశాలు జారీ చేశారు.
VZM: 2018 గ్రూప్-1 అధికారులపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఆర్డీలోలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. వారిని అప్రాధాన్యత పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం కోర్టుకు కూడా హాజరుకావాల్సి వచ్చింది. వారిలో విజయనగరం ఆర్డీవో దాట్ల కీర్తి కూడా ఉన్నారు.
కృష్ణా: కలెక్టర్ బాలాజీ కంకిపాడు(M)లోని ఈడుపుగల్లులో నిర్మాణంలో ఉన్న తారురోడ్డును బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఆపి నిర్మాణ నాణ్యత, గతంలో ఎదురైన ఇబ్బందులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పనుల పురోగతిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు మండలంకు చెందిన ఆర్‌అండ్‌బీ డీఈఈ బలరాం పాల్గొన్నారు.
GNTR: డ్రగ్స్ మాఫియా, కార్పొరేట్ వైద్య దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ నేత నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులో జరిగిన పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28న డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా నిర్వహించే నిరసనలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం గంజాయి, కల్తీ ఆహారం నియంత్రించడంలో విఫలమైందన్నారు.
సత్యసాయి: అమరావతిలో జరుగుతున్న శాసనసభ్యుల క్రీడా పోటీల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందడి చేశారు. బుధవారం నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌లో ఆయన పాల్గొని ఉత్సాహంగా బౌలింగ్ చేశారు. అనంతరం బ్యాట్ తోనూ అలరించారు. వృత్తిపరమైన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.
PLD: గిరిజన తండాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కింద 6 మండలాల్లోని 22 తండాలకు పైపులైన్లు, రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ తక్షణమే అనుమతులు ఇవ్వాలని సూచించారు. క్యాంపు కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మౌలిక వసతుల కల్పనపై ఆమె దిశానిర్దేశం చేశారు.
AKP: చోడవరం మండలం కన్నంపాలెంలో ఉపాధి నిధులతో నిర్మించనున్న రహదారి నిర్మాణానికి సంబంధించిన సామగ్రిని ఎంపీడీవో సీతారామస్వామి బుధవారం తనిఖీ చేశారు. గ్రామంలో కల్లా వారి పొలాల నుంచి స్మశానం వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలు మంజూరయ్యాయి. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు.
NLR: చౌక ధరల దుకాణ దారుల డీలర్లు తమ సమస్యలు పరిష్కరించేలా చూడాలని ఆ సంఘం సంక్షేమ సమాఖ్య సభ్యులు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కమిషన్ నెలకు రూ. 6 వేల నుంచి 8 వేల వరకు మాత్రమే అందుతుందన్నారు. రూ. 35 వేలు ఆదాయం వచ్చేలా, డీలర్ల కుటుంబానికి ఆరోగ్య కార్డులను అందించేలా కేంద్ర దృష్టికి తీసుకెళ్తామన్నారు.
NLR: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం సోదరుల సౌకర్యార్థం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వాటర్ కూలర్ల వితరణ చేశారు. బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని దామరమడుగు, పెనుబల్లి వవ్వేరు, చెల్లాయపాలెం, పంచేడు గ్రామాలలోని 5 మసీదు కమిటీ సభ్యులకు వీటిని అందజేశారు. మసీదులోకి వచ్చే ముస్లింల సౌకర్యార్థం కూలర్లను ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
KDP: గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచారు. నిందితులను గుర్తించి కౌన్సిలింగ్, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
E.G: కలుషిత పాలు కారణంగా వైద్య సహాయం అవసరమయ్యే రోగులకు ఫోమెబెస్ట్ యాంటీడోట్ అందించడం కోసం ముంబై నుండి ప్రత్యేకంగా తీసుకువస్తున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం వెల్లడించారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఇంజెక్షన్ ఉపయోగించవచ్చని చెప్పారు. ఈ మందు అంతర్జాతీయ స్థాయిలో సంప్రదించి ఏజెన్సీల ద్వారా తీసుకువస్తున్నామన్నారు.
కోనసీమ: మండపేటలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండపేట, ద్వారపూడి, రూరల్ మండలం గ్రామాల్లో ఈదురు గాలులతో వర్షం పడింది. కేశవరంలో భారీ వర్షం కురిసింది. మండపేటలో వర్షం వలన డ్రైన్ లలో నీరు రోడ్‌పై ప్రవహించింది. ద్వారపూడిలో డ్రైన్‌లు మూసుకొని పోవడంతో రోడ్ మీద నీరు నిలిచిపోయింది. మండపేటలో పలు ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్‌పై ప్రవహించింది.
ASR: జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకులు ఆర్.హేమంత్ కుమార్ బుధవారం పాడేరు వచ్చారు. పాడేరు పీఎంఆర్సీ అతిథి గృహంలో ఆయనను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో చేపడుతున్న శాంతిభద్రతల పరిరక్షణ, అవగాహన కార్యక్రమాలపై కలెక్టర్ వివరించారు.