ఎమ్మిగనూరు (Emmiganur) నియోజకవర్గం ఇబ్రహీంపురంలో అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను లోకేశ్ పరామర్శించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని లోకేశ్ వద్ద మిర్చి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం పంట నష్టం అంచనా వెయ్యడానికి కూడా ఎవరూ రాలేదని రైతులు వాపోయారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర 83వ రోజుకు చేరుకుంది. నేడు మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు నియోజక వర్గంలోని నందవరం మండలంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఇబ్రహీంపట్నం చర్చి వద్ద స్థానికులతో నారా లోకేష్ సమావేశం కానున్నారు. కొట్టాల క్రాస్ వద్ద నది కైరవాడ గ్రామస్తులతో భేటీ జరగనుంది. మాచాపురం శివారులో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం మాచాపురం(Machapuram)లో ఎస్సీలతో సమావేశం కానున్నారు. నందవరం చర్చి వద్ద స్థానికులతో సమావేశం జరగనుంది. నందవరం శివారు విడిది కేంద్రంలో నారా లోకేష్ రాత్రికి బస చేయనున్నారు.మధ్యాహ్నం భోజన విరామానంతరం హోరు వర్షంలోనూ లోకేశ్ పాదయాత్ర (Pādayātra) కొనసాగించారు. పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకర్గం మాచాపురం శివార్లకు చేరుకోగానే కుండపోత వర్షం కురిసింది. గొడుగును సైతం తిరస్కరించి వర్షంలోనే యాత్రను కొనసాగించారు. కొద్దిసేపు ఆగాలన్న నాయకుల విజ్జప్తిని తిరస్కరించారు. దాంతో నాయకులు, కార్యకర్తలు వర్షంలోనే యువనేతను అనుసరించారు. లోకేశ్ తోపాటు యువగళం బృందాలు, వాలంటీర్లు, అభిమానులు తడిసి ముద్దయ్యారు.
వర్షం కురుస్తున్నా లోకేశ్ ని చూసేందుకు మాచాపురం గ్రామంలో భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. 83వరోజు యువనేత లోకేష్ 14.2 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు 1073.9 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు.సీమప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడం చేతగాని జగన్ రెడ్డి గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన పథకాలకు మాత్రం సిగ్గులేకుండా స్టిక్కర్లు, రంగులు వేసుకుంటున్నాడని లోకేశ్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఎమ్మిగనూరు (Emmiganur) నియోజకవర్గం ఇబ్రహీంపురంలో ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద గత ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేసిందని వెల్లడించారు.ఈ పథకానికి నీరు అందించడం చేతగాక పాడుబెట్టిన వైసీపీ నేతలు (YCP leaders) జలగన్న స్టిక్కర్ మాత్రం వేసుకున్నారని మండిపడ్డారు. ఎవరికో పుట్టిన బిడ్డలను తమ బిడ్డలని చెప్పుకోవడం అలవాటుగా మారిన సైకో బ్యాచ్ ఖాళీ ఖజనాతో చేయగలిగింది ఏముంది? అంటూ ఎద్దేవా చేశారు. ఇంతకుమించి మేం పీకేదేం లేదని ఆ స్టిక్కర్లు మీ ముఖాలకు వేసుకుంటే ఇంకా బాగుంటుందని చురకలంటించారు.