తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ….ఇప్పటి నుంచే అన్ని పార్టీలకు అందుకు తగినట్లు సమాయాత్తమౌతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ పలానా పార్టీతో పొత్తు పెట్టుకుంటోందంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. కాగా… ఈ విషయంపై తాజాగా చంద్రబాబు నోరు విప్పారు.
రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీ గెలిచి తీరాలని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయలంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశం లో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
పాలకుడికి ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్వేషమేనని పాలకుల విజన్ పోయి పాయిజన్ గా తయారయ్యిందని ఆరోపించారు. రావాల్సిన బకాయిలపై అనంతపురంలో కానిస్టేబుల్ ప్ల కార్డు పట్టుకున్నందుకు ఆయనను టార్గెట్ చేసి ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. కానిస్టేబుల్ తనను వేధించలేదు అని చెప్పిన శ్రీ లక్ష్మిని వేధిస్తున్నారని, కానిస్టేబుల్ ప్రకాష్ ఇప్పుడు కనపడడం లేదని చంద్రబాబు ఆరోపించారు. సమస్యలను ప్రస్తావిస్తే,దాడులు, విధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చింతూరులో వరదల సమయంలో సిఎం జగన్ పిలిచి మాట్లాడిన బాలిక డెంగ్యూవచ్చి చనిపోయిందని, దీనికి సిఎం ఏం సమాధానం చెబుతారని, ఇది ప్రభుత్వ హత్య కాదా అని నిలదీశారు. వరద ప్రాంతంలో దోమల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విదేశీ విద్యను ఆపేశారని, బిసిలకు ఒక్క పథకం లేదని మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ కు నిధులు లేవని, రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరన్నారు.
సంస్థాగత విషయాల్లో రాజీ పడేది లేదని, పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయంలో పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు. నేతలు సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకోవాలని, విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే మరింత ఎక్కువ నష్టమని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాష్ట్రంలో ఇంట్లోంచి టిడిపి నేతలు భయటకు వస్తే కేసులు పెడుతున్నారని, జగన్ కు నిద్రలో కూడా టిడిపి నేతలే గుర్తుకు వస్తున్నారన్నారు. పోలీసులు లేకుండా వైసిపి వాళ్లు వస్తే ఒక్క నిముషంలో వారి పని తేలిపోతుందని, ఇది టీడీపీ సవాల్ అన్నారు. టీడీపీ నేతలు తమ సౌకర్యం కోసం ఇంట్లో పడుకుంటే..ఎన్నికల అనంతరం కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.. కేసులు, దాడులపై న్యాయ పరంగా, రాజకీయంగా పోరాడుతామని ప్రకటించారు