స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రభుత్వ విప్ సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు డైరెక్షన్ లోనే స్కామ్ జరిగినట్లు తెలిపారు. దానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Ap Skill developement scam case)లో చంద్రబాబుకు బెయిల్ (Chandrababu Bail) మంజూరైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టీడీపీ (TDP) నేతలంతా సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన తాజా విషయాలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు డైరెక్షన్ లోనే స్కిల్ స్కామ్ జరిగిందన్నారు. వివిధ స్టేజీల్లో అప్పటి సీఎం చంద్రబాబు సంతకాలు కూడా ఉన్నట్లు గుర్తు చేశారు.
ప్రజల సొమ్మును షెల్ కంపెనీల (Shell companies) పేరుతో చంద్రబాబు దోచేసినట్లు ఆరోపణ చేశారు. ఫేక్ షెల్ కంపెనీల పేరుతో అవినీతి జరిగిందని, ఫేక్ ఇన్వాయిస్ల (Fake Invoice)తో రూ.241 కోట్లను దోచుకున్నట్లు వెల్లడించారు. ఐటీ శాఖ నోటీసుల్లో అన్ని లింకులు బయటపడినట్లు స్పష్టం చేశారు. స్కిల్ స్కామ్ కేసులో బాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో ఎల్లో మీడియా హడావుడి చేస్తోందన్నారు. ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందన్నారు.
స్కిల్ స్కామ్ కేసులో తనకు సంబంధం లేదని చంద్రబాబు (Chandrababu) నిరూపించుకోవాలని, కానీ రాజకీయ సానుభూతి కోసం బాబు ప్రయత్నిస్తున్నారన్నారు. స్కిల్ స్కామ్ ఎలా జరిగిందో తమ ఆధారాలు ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఆ ఆధారాలన్నీ కూడా సీఐడీ (CID) తరపు లాయర్లు కోర్టుకు సమర్పించారని, అవినీతి జరిగినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు లాయర్లు ఏ రోజూ కూడా స్కిల్ స్కామ్ జరగలేదని వాదించలేదని, గంటా సుబ్బారావుకు 5 అధికారాలు ఎందుకు ఇచ్చారో స్పష్టంగా తెలుపలేదన్నారు.
నిధులు దారి మళ్లినట్లుగా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) తెలిపారు. చంద్రబాబు అనారోగ్యం బాలేదని బెయిల్ పై బయటకు వచ్చారని, కానీ ఆయన విజయయాత్రలో త్వరలో పాల్గొంటున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. అనారోగ్యంతో ఉంటే విజయయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు నిజాలేంటో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు (Chandrababu) ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.