జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ప్రత్యేక బస్సు వారాహితో రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ వాహనం రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయింది. బస్సుకు 24వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారని, అనంతరం ఆలయ సన్నిధిలో వారాహి వాహనానికి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారని పేర్కొంది.
2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తిమంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురికాగా, ఆంజనేయుడి కటాక్షంతో ప్రమాదం నుండి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ బాగా విశ్వసిస్తారు. ఈ కారణంగా ఆయన తలపెట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుండి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారు. రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన వారాహి వాహనాన్ని ఇక్కడి నుండి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత అనుష్టుప్ నారసింహ యాత్రను ప్రారంభించాలని పవన్ సంకల్పించారు. అంటే 32 నారసింహ క్షేత్రాల సందర్శనం. ఇందులో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుట్టనున్నారు. తర్వాత మిగతా 31 నారసింహ క్షేత్రాలను సందర్శించి, పూజలు చేస్తారు.
24వ తేదీన కొండగట్టులో పూజా కార్యక్రమాల అనంతరం తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి, నాయకులకు దిశా నిర్దేశనం చేస్తారని ప్రకటనలో తెలిపారు.