రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) సంచలన నిర్ణయం తీసుకున్నారు.మహిళలపై వేధింపులు అత్యాచారాలకు ప్రయత్నించే వారికి ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారని ప్రకటించారు.ఇలా చేసే వారి క్యారెక్టర్ సర్టిఫికెట్ (Character Certificate)పై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడ్డారని రాసి ఉంటుందని, వారికి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఉద్యోగం లభించదని అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి గెహ్లాట్ తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతా ద్వారా వెల్లడించారు. మహిళలపై నేరాలను అరికట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న నేరాలను అరికట్టాలని భావిస్తోంది. రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీఎన్నికలకు ముందు మహిళల భద్రతపై కఠినమైన సందేశం ఇచ్చారు.
మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి, ఆయా ఘటనలతో ప్రమేయం ఉన్నవారికి, లైంగిక దుష్ప్రవర్తన కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు చెప్పారు.ఉద్యోగానికి ఎంపిక చేసేముందు స్థానిక పోలీస్ స్టేషన్లు (Police stations) లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నడవడిక ధ్రవపత్రాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రాజస్థాన్లో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ (BJP) విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో గెహ్లాట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హిస్టరీ-షీటర్ల వంటి పోలీస్ స్టేషన్లలో వేధింపులకు పాల్పడిన వారి రికార్డు నమోదు చేయబడుతుంది. ఈ వ్యక్తులు వేధింపుల సంఘటనలలో పాల్గొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం/పోలీసులు జారీ చేసిన వారి క్యారెక్టర్ సర్టిఫికేట్(Character Certificate)లో పేర్కొంటారు. ఇలాంటి సంఘ వ్యతిరేకులను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.