ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ ఏపీలో కొత్త రాజకీయ పార్టీని ఆదివారం వెల్లడించారు. తన పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీగా ప్రకటించారు. సంక్షిప్తంగా బీసీవై పార్టీగా ఏపీలో గుర్తింపు పొందనుంది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ వద్ద ఈ రోజు సాయంత్రం ప్రజా సింహగర్జన సభను రామచంద్ర యాదవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో ఆయన ప్రసంగించారు. రామచంద్రయాదవ్ తన పార్టీ పేరును ప్రకటిస్తూ తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
భారీ ప్రజా సింహగర్జన సభకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, ఢిల్లీ వర్సిటీ ఫ్రొఫెసర్, బీసీ ఉద్యమకారుడు సూరజ్ మండల్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సభలో రామచంద్రయాదవ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో బీసీవై పార్టీని ఏర్పాటు చేశానని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కొత్త రాజకీయ ప్రస్థానం మొదలవ్వాలని, అందుకు బీసీవై పార్టీ ముందడుగు వేస్తుందన్నారు.