YS Jagan వేసుకునే చెప్పుల విలువ రూ.లక్ష 34 వేలు.. తాగే నీళ్ల ధర రూ.5,499
జగన్ కు బంగారు గని దొరికిందా? బావి తవ్వుతుంటే వజ్రాలు దొరికాయా?’ అని వెంకటరమణా రెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ కు తెలంగాణ, ఏపీతో సహా దేశంలో 9 ఇళ్లు ఉన్నాయని తెలిపారు.
ఏపీ సీఎం జగన్ (YS Jagan)పై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి (Anam Venkata Ramana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద ముఖ్యమంత్రినంటూ చెప్పుకునే జగన్ దాదాపు రూ.లక్షన్నర విలువైన చెప్పులు (Sandals) ధరిస్తాడని, రూ.ఐదు వేల విలువైన నీళ్ల బాటిల్ (Water Bottle) తాగుతాడని ఆరోపించారు. అతడికి మొత్తం 9 ఇళ్లు ఉన్నాయని తెలిపారు. ఇలా సీఎం జగన్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై కీలక విషయాలు వెంకటరమణా రెడ్డి పంచుకున్నారు. మంగళగిరిలోని (Mangalagiri) పార్టీ కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
‘తాడేపల్లి ప్యాలెస్ లో పొద్దున, మధ్యాహ్నం ఉప్మా, రాత్రి జావ తాగుతూ జీతం (Salary) తీసుకోకుండా పని చేస్తున్నానని సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన ధరించే చెప్పులు, తాగే నీళ్లు, రాసే పెన్ను చాలా ఖరీదైనవి’ అని ఆనం వెంకటరమణా రెడ్డి తెలిపారు. ముఖ్యంగా జగన్ వేసుకునే చెప్పులు ఏకంగా రూ.1,34,800 ధర అని వెల్లడించారు. అలాంటి ఇలాంటి చెప్పులు కావంట.. అవి ఏకంగా మొసలి (Crocodile) చర్మంతో చేసిన చెప్పులు అని వివరించారు. జగన్ వేసుకునే చెప్పుల కంపెనీ బెర్లుటి (Berluti).. ఇది ఫ్రాన్స్ లో తయారుచేస్తుందని వివరించారు. జగన్ వాడే పెన్ను (Pen) ధర రూ.లక్ష ఉంటుందని తెలిపారు. ఇక సీఎం జగన్ తాగే నీళ్ల బాటిల్ ధర రూ.5,499. ఆవ (Aava) కంపెనీకి చెందిన 750 మిల్లీ లీటర్ బాటిల్ జగన్ తాగుతాడని చెప్పారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు రూ.50 విలువైన నీళ్లు తాగినట్లు సాక్షిలో తెగ ప్రచారం చేశారని గుర్తు చేశారు.
‘2004లో వైఎస్సార్ హయాంలో జగన్ ఆస్తి రూ.1.74 కోట్లు ఉంటే 2009కి వచ్చేసరికి రూ.77.39 కోట్లు ఉంది. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ఆస్తి (Assets) రూ.445 కోట్లకు పెరిగింది. 2019లో రూ.510 కోట్లకు జగన్ ఆస్తి పెరిగింది. ఇంతలా ఆస్తులు పెరిగుతున్నాయంటే జగన్ కు బంగారు గని దొరికిందా? బావి తవ్వుతుంటే వజ్రాలు దొరికాయా?’ అని వెంకటరమణా రెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ కు తెలంగాణ, ఏపీతో సహా దేశంలో 9 ఇళ్లు ఉన్నాయని తెలిపారు. ఏపీలోని పులివెందుల, తాడేపల్లి, కడప, విశాఖలోని రుషికొండపైన ఇళ్లు ఉన్నాయని, తెలంగాణలోని హైదరాబాద్ లో లోటస్ పాండ్ తోపాటు బెంగళూరు, చెన్నై, ముంబై, కలకత్తాలలో సీఎం జగన్ కు ఇళ్లు ఉన్నాయని వివరించారు. మరి ఇలాంటివి సాక్షిలో కనిపించవా? అని ప్రశ్నించారు. జగన్ మాటలు అన్ని అబద్ధాలేనని విమర్శించారు.