తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందని…. ప్రజలు వేరే పార్టీ కోరుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఈ మునుగోడు దానికి నిదర్శనంగా తేలనుందని అందరూ భావించారు. కానీ…. అందరు అంచనాలను తలకిందులు చేస్తూ… చివరకు టీఆర్ఎస్ విజయం సాధించింది. అధికార పార్టీకి అనుకూలంగా ఫలితం రావడంతో ఆ పార్టీ నేతలు సంతోషించడంతో పాటు సంబరాలు జరుపుకుంటున్నారు. 2014, 2018 ఎన్నికల్లో సీఎం అయిన కేసీఆర్ 2024 ఎన్నికల్లో కూడా మరోసారి తెలంగాణకు సీఎం కావడం ఖాయమని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. 15 సంవత్సరాలు సీఎంగా పాలించిన అరుదైన రికార్డును కేసీఆర్ సొంతం చేసుకోనున్నారు.
2024 ఎన్నికల్లో తెరాసకు అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో తెరాస సర్కార్ పై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది. హైదరాబాద్ మినహా తెలంగాణలో అభివృద్ధి చెందిన ప్రాంతాల సంఖ్యను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఏపీలో అమలవుతున్న స్థాయిలో తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ప్రజల్లో సైతం ఒకింత అసంతృప్తి ఉంది. కేసీఆర్ ఉపఎన్నికలో పార్టీ గెలిచినంత మాత్రాన ఈ గెలుపును చూసి పొంగిపోతే మాత్రం నష్టం తప్పదని చెప్పవచ్చు.