NZB: బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేశ్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జాతీయ సర్పంచ్ సంవాద్ ఆన్‌లైన్ పోటీలను ఈనెల 18 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా సర్పంచ్‌లకు నిర్వహించారు. ఈ పోటీలో బాల్కొండ సర్పంచ్ రాజేశ్ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచారు.
MLG: జిల్లా కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో CMRF కింద మంజూరైన సుమారు 5 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు సోమవారం రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CMRF పథకం నిరుపేదలకు ఓ వరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో SC, ST అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు జన్ను రవి తదితరులు ఉన్నారు.
SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేట గ్రామానికి చెందిన సారా కార్తీక్ (15) అనే బాలుడికి ఇటీవల ప్రమాదంలో కాలు కోల్పోయాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం, దాతల అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో PACS మాజీ చైర్మన్ ఊర్మిల రాంరెడ్డి ఆదివారం రూ. 1 లక్ష ఆర్థిక సహాయం బాధిత బాలుడికి అందించి అండగా నిలిచారు.
MDK: చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో గుర్తు తెలియని యువకుడు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. మిర్జాపల్లికి చెందిన ప్రజలు ఈ దారిన వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. హత్య చేసింది ఎవరూ అనే విషయాలు తెలియాల్సి ఉంది.
JGL: వ్యవసాయ మార్కెట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ సెక్యూరిటీ గార్డులు ఆదివారం రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలని వారు కోరారు. కనీస వేతన చట్టం అమలుకు కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ASF: రెబ్బెన మండలం గంగాపూర్ పరిసరాల్లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న ముఠాపై మెరుపు దాడి చేసి ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు SI వెంకటకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 2,540 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
KMM: వ్యవసాయ యాంత్రీకరణతోనే సాగు లాభసాటిగా మారుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నేత మట్టా దయానంద్ అన్నారు. ఆదివారం పెనుబల్లిలో 50 శాతం సబ్సిడీపై రోటవేటర్లు, బేయిలర్లు, స్ప్రేయర్లను రైతులకు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ బాగం నీరజ పాల్గొన్నారు.
MBNR: తిమ్మాజీపేట మండలం అవంచ గ్రామంలో నూతన ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సోమవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామంలో నూతన దేవాలయం నిర్మిస్తుండడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. అందుకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
NLG: మహిళల వంటింటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం పట్టాలు తప్పుతోంది. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్న హామీపై NLG జిల్లాలోని పేద, మధ్య తరగతి మహిళలు పెట్టుకున్న నమ్మకం సడలుతోంది. 12 నెలలకు పైగానే లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమకాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
PDPL: సివిల్ సప్లై హమాలీ యూనియన్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కడారి సునీల్, ప్రధాన కార్యదర్శిగా ఎం.గట్టయ్య, ఉపాధ్యక్షునిగా ఎం.కుమార్, సహాయ కార్యదర్శిగా ఎం.తిరుపతి కోశాధికారిగా బి. పోచమల్లు, కార్యవర్గ సభ్యులుగా జి.సమ్మయ్య, మహేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని సత్కరించారు.
నిర్మల్ పట్టణంలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అమలుకు నోచుకోని హామీలను ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ నేతలను పోలీసులు ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు.
NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని నిరసిస్తూ.. బీజేపీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా చిట్యాల పోలీసులు ఇవాళ స్థానిక నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. 6 గ్యారెంటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి హామీలను రేవంత్ సర్కార్ విస్మరించిందని జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెళ్ళ శ్రీను విమర్శించారు.
NZB: సిరికొండ మండలంలోని బీజేపీ నాయకులను పోలీసులు ఆదివారం అర్థరాత్రి ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా సోమవారం కలెక్టర్ ముట్టడి నేపథ్యంలో అరెస్టు చేశారు. శాంతి యుతంగా ప్రజా సమస్యలపై నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేసడం పట్ల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ అసహనాన్ని వ్యక్తం చేశారు.
KMR: రాజంపేట మండలంలో పదో తరగతి పరీక్షలను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ జిల్లా విద్యాశాఖ ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు. తెలుగు, హిందీ పరీక్షలు ముగిసిన అనంతరం పదో తరగతి పరీక్షా పత్రాల వ్యవహారంపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఒక తీరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరో తీరు వ్యవహరిస్తున్నారన్న తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
KNR: హుజూరాబాద్ మండలంలో 4 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు ఇంగ్లీష్ పరీక్ష మండలంలో 821 మంది హాజరుకానున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 291, గురుకులాల నుంచి 235, ప్రైవేట్ పాఠశాలల నుంచి 295 మంది ఉన్నారు. ఉ.9:30-12:30 వరకు పరీక్ష జరుగుతుంది. పట్టణంలో 3 పరీక్ష కేంద్రాలు, చెల్పూర్ ZPHSలో 1 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు MEO తెలిపారు.