SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా ఆదివారం నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. రబీ పంటల సేద్యానికి చివరి విడతగా 60 క్యూసెక్కుల సాగునీళ్లు వదిలినట్లు చెప్పారు. ఆయకట్టుదారు రైతులు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అయితే ఎడమ కాల్వ నీటిని వదల లేదన్నారు.
BDK: మార్చి 30వ తేదీ, సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
యాదాద్రి: టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చౌటుప్పల్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకావిష్కరణ చేసి, వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SDPT: తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పాశికంటి సత్యం పిలుపునిచ్చారు. ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కాంచిట్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ సాధించిన ప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని పార్టీని బలోపేతం చేస్తాం అన్నారు.
NZB: సిరికొండ మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే, డీసీఎస్ యాప్‌లో 80 శాతం సర్వే పూర్తి అయ్యిందని మండల వ్యవసాయ అధికారి నర్సయ్య తెలిపారు. 2025-2026లో రైతు పంటల వారీగా సాగు విస్తీర్ణం వివరాలు డీసీఎస్ యాప్‌లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు.18 మంది వాలెంటీర్ల ద్వారా నమోదు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో ఐదు రోజుల్లో సర్వే పూర్తి చేస్తామని ఆదివారం వెల్లడించారు.
జగిత్యాల రూరల్ మండలం అంతర్గం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ్డం మహిపాల్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల విద్యా అభివృద్ధి, క్రమశిక్షణ పెంపు, పాఠశాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వారు ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు.
GDWL: జిల్లా పాల ఉత్పత్తిదారుల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఏ. వెంకటస్వామి, అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పెద్ద పరుషరాముడు ఎంపికయ్యారు. పాడి రైతుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం ఈ సంఘం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని పలువురు పాడి రైతులు పాల్గొన్నారు.
BDK: కొత్తగూడెం పట్టణ కేంద్రంలో టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ NTR విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
NLG: నకిరేకల్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పూజర్ల శంభయ్యను ఆదివారం మైనారిటీ పట్టణ అధ్యక్షుడు మతీన్ ఘనంగా సత్కరించారు. శంభయ్యకు శాలువా కప్పి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శంభయ్య మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
WGL: సంగెం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను అదనపు కలెక్టర్ సంధ్య రాణి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి ఆహారం నాణ్యత, పరిమాణంపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అడిగి తెలుసుకుని, సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.
KMR: TUసౌత్ క్యాంపస్ (భిక్కనూరు) విద్యార్థులు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో సత్తా చాటారు. ఇటీవల వెలువడిన టీజీసెట్ పరీక్షల్లో పొలిటికల్ సైన్స్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న నాయిని అఖిల, సోషల్ వర్క్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న రత్నావత్ దివ్య అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఎలిజిబిలిటీ సాధించారు. దీంతో ఆయా విభాగాల అధ్యాపకులు, అభినందించారు.
MDCL: అల్వాల్ సర్కిల్ టీడీపీ పార్టీ ఇంఛార్జ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సుభాష్ నగర్‌లోని గొల్లగూడ కమాన్ వద్ద టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పార్టీ స్థాపకులను స్మరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లగూడ శీను, నర్సింగరావు, ప్రతాప్, అఖిలేష్, దత్తాత్రేయ, కిట్టు, ఉన్నారు.
SRPT: సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ మద్దిరాల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, కేసుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన అన్నారు.
ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఈనెల 31వ తేదీలోగా ఆస్తి పన్ను, వ్యాపార లైసెన్స్ ఫీజులు చెల్లించాలని కమిషనర్ గజానంద్ ఆదివారం సూచించారు. గడువు ముగుస్తున్నందున బకాయిలను వెంటనే చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గడువు దాటితే నిబంధనల ప్రకారం పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు. పన్నులు చెల్లించి ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు
MBNR: సీసీకుంట మండలం మండబండర్పల్లి గ్రామంలోని అలివేలుమంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి 44 వ బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా యజ్ఞ కార్యక్రమాలతో పాటు, ఏప్రిల్ 2న స్వామివారి కళ్యాణోత్సవం, రాత్రి వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.