బీఆర్ఎస్ బహిష్కృత నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై (Ponguleti Srinivasa Reddy) అదే ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశాడు. పొంగులేటిని చేర్చుకుంటే ఆ పార్టీలు నాశనమే అని శాపనార్థాలు పెట్టారు. అసెంబ్లీ గేట్లు తాకనివ్వను అని చెప్పడంపై బీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి (Sathupalli) ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (Sandra Venkata Veeraiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసిన మమ్మల్నే విమర్శించడం సరికాదని మండిపడ్డారు.
ఖమ్మం జిల్లా (Khammam District) తల్లాడ (Thallada) మండలంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం సండ్ర మాట్లాడారు. ‘పొంగులేటి వెంట తిరిగే వారందరూ ఉదయం ఆయన వెంట.. సాయంత్రం వేరే నాయకుడితో కలిసి తిరుగుతున్నారు. కానీ ఆ నాయకుడికి మాత్రం తెలియదు. నీ వెంట ఉండేవాళ్లంతా నీ వాళ్లు కాదు. పనులు చేయని పొంగులేటి అహంకార పూరితంగా మాట్లాడితే ఎవరు ఓట్లు (Votes) వేస్తారు? ఇలాంటి నాయకుడు ప్రజలకు అవసరమా? ప్రజలే గమనించాలి’ అని సండ్ర వెంకటవీరయ్య తెలిపాడు. ‘పార్టీ కోసం పని చేసే వారిని సమర్ధించాలి. కానీ వ్యక్తి ప్రయోజనం కోసం పని చేసే వారిని సమర్థించకూడదు. అలాంటి నాయకుడిని చేర్చుకుంటే ఆ పార్టీలే నాశనమవుతాయి’ అని పేర్కొన్నాడు.
‘పొంగులేటి ప్రజలకు చేసిన మంచి పనులు ఏమిటో ప్రజలకు చెప్పాలి. ప్రజలకు అన్నీ మంచి పనులు బీఆర్ఎస్ చేసింది.. కాబట్టే ప్రజల విశ్వాసం పొందుతున్నాం. ప్రజల విశ్వాసం మాకే ఉంటుంది. పొంగులేటి రాజకీయాల్లోకి రాకముందు అతడి పరిస్థితి ఏమిటో తెలుసు. జిల్లాలో నీవు ఏం అభివృద్ధి (Development) చేశావు? నీకు ఎలా ఓట్లు వేస్తారు?. రెండు జాతీయ పార్టీలు నీకోసం ఎదురుచూస్తున్నాయని చెబుతున్నావు. ఆ పార్టీలో ఉన్న నాయకులు కాదు. నీవు వారి నాయకుల వైపు చూస్తున్నావు. జిల్లాలో అభ్యర్థులు ప్రకటించి జాతీయ పార్టీలకు వెళ్తున్నా అని చెబుతున్నావు. అంటే ఆ పార్టీలు నీకు మద్దతు ఇస్తాయా? ఆ పార్టీ విధానాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. వారికి వచ్చే ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెబుతారు. మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే (BRS Party)’ అని వెంకటవీరయ్య స్పష్టం చేశారు.