తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ చేస్తున్న పని గురించి మాట్లాడుతూ… బండి సంజయ్ కంటతడి పెట్టుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు నోటీఉలు జారీ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే కావాలని బీఎల్ సంతోష్ ఎప్పుడూ అనుకోలేదని, ఆస్తులు కూడబెట్టుకోవడం, విదేశాల్లో వ్యాపారాలు చేయడం లేదని, ఢిల్లీ మద్యం స్కామ్ నుంచి బయటపడేందుకు తెలంగాణ ప్రభుత్వం సంతోష్‌ను అవమానిస్తున్నారని బండి సంజయ్ కంటతడి పెట్టారు.
సంతోష్ జోలికి వస్తే ఊరుకోబోమని, సహించబోమని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఈ కేసులో బీఎల్ సంతోష్ తో పాటు మరికొందరికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ విచారణకు హాజరుగాని వారికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఉపయోగించి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు చేస్తుంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఢిల్లీ మద్యం కేసు, చికోటి ప్రవీణ్ క్యాసినో కేసు, గ్రానైట్ కేసులలో దూకుడు పెంచింది. అంతేకాదు, వివిధ రాజకీయ నేతలపై ఈడీ, ఆదాయపన్ను అధికారులు దాడులు చేస్తున్నారు.