టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కోపం వచ్చినా తట్టుకోలేం.. ప్రేమ వచ్చినా తట్టుకోలేం. అందుకు ఆయన ఇటీవల చేసిన పనులే నిదర్శనం.. మొన్నటికి మొన్న కోపంతో.. దినేష్ కార్తీక్ మెడ పట్టుకున్న రోహిత్… నిన్న ప్రేమగా ముద్దు పెట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే… హైదరాబాద్ వేదికగా… ఆసీస్, టీమిండియాలో పోటీ పడిన సంగతి తెలిసిందే.
తొలుత టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ తొలి ఓవర్ నుంచే భారత బౌలర్ల పైన విరుచుకుపడింది. తొలి ఓవర్ రెండో బంతినే సిక్స్ గా మలిచి గ్రీన్ తన పరుగుల వేటలో వేగం పెంచాడు. 19 బంతుల్లోనే గ్రీన్ 50 పరుగులు చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసాడు. ఇక, మ్యాచ్ 8వ ఓవర్ లో ఒక ఆసక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది. చాహల్ బౌలింగ్ ప్రారంభించాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని మ్యాక్స్ వెల్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు. బౌండరీ వద్ద అద్భుతంగా బాల్ అందుకున్న అక్షర్ పటేల్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్ట్రైకర్ ఎండ్ వైపు బాల్ విసిరాడు.
అయితే రెండో రన్ కోసం ప్రయత్నిస్తున్న మ్యాక్సీ ఆ బంతి నేరుగా వికెట్లను తాకుతుందని అస్సలు ఊహించి ఉండడు. అందుకే డైవ్ దూకలేదు. ఇక దినేష్ కార్తీక్ సైతం తొలుత గ్లవ్స్ వికెట్లకు తాకించడంతో ఒక బెయిల్ ముందే లేచింది. అయితే బాల్ నేరుగా వచ్చి వికెట్లకు తాకడంతో రెండో బెయిల్ కూడా లేచింది. దీంతో అంపైర్ ఔటిచ్చాడు. అంతే స్టేడియం హోరెత్తింది.
మ్యాక్సీ ఖంగుతిన్నాడు. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తో సరాదాగా వ్యవహరించాడు, బాల్ రాకముందే దినేశ్ తన గ్లోవ్స్ తో వికెట్లను పడేయటం పైన తొలుత రోహిత్ కొంత ఆగ్రహంగా కనిపించాడు. కానీ, థర్డ్ అంపైర్ దీనికి అవుట్ గా ప్రకటించటంత రోహిత్ నవ్వుకుంటూ వచ్చి డీకే హెల్మెట్ ముద్దాడాడు. దీంతో..ఉప్పల్ స్టేడియం మొత్తం చప్పట్లతో హోరెత్తింది.