ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చల్లబడ్డారా.. అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. కొత్తగూడెం పర్యటనలో తుమ్మల మొదటి నుండి చివరి వరకు అధినేత కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆయనను సీఎం ఆత్మీయంగా పలకరించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా తుమ్మలను పిలిచి తన పక్కన నిలబెట్టుకున్నారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవానికి తన బస్సులో తీసుకువెళ్లారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తుమ్మలకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్కు ఇక్కడి నుండి ముగ్గురు కీలక నేతలు నామా నాగేశ్వర రావు, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే తనకు, తన వర్గీయులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరిస్తారనే ఉద్దేశ్యంతో పొంగులేటి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఇటీవలి బహిరంగ సభలో అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తుమ్మల కూడా కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. పార్టీ మారడంపై నిర్ణయం తీసుకునేందుకు ఆయన తన అనుచరులతో చర్చలు జరపారని ప్రచారం సాగింది. టీడీపీ కేడర్ కూడా తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించింది. ఇటీవల చంద్రబాబు తెలంగాణలో చాలా రోజుల తర్వాత తొలి బహిరంగ సభ పెట్టి, విజయవంతం చేశారు.
గతంలో తుమ్మల టీడీపీలోనే ఉండటం, చంద్రబాబుతో సత్సంబంధాలు, ఖమ్మంలో ఆ పార్టీకి మంచి కేడర్ ఉండటంతో అటు అడుగు వేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఖమ్మంలో బీఆర్ఎస్కు పెద్దగా పట్టు లేదు. నామా, తుమ్మల, పొంగులేటి, సండ్ర.. ఇలా బలమైన నేతలు లేదా గెలిచిన ప్రజాప్రతినిధుల ద్వారా మాత్రమే పట్టు సాధించింది.
ఇప్పుడు పొంగులేటి పక్క చూపులు చూస్తున్నారు. మిగిలిన ఇద్దరు కీలక నేతలు నామా, తుమ్మలలోను మరొకరు పోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఈ జిల్లాలో ఇబ్బందికరమే. పొంగులేటి దెబ్బతో జాగ్రత్తపడిన కేసీఆర్…, తుమ్మల వెళ్లిపోకుండా తన పర్యటనలో ప్రాధాన్యత ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ఇక్కడకు వచ్చే ముందే మంత్రి హరీష్ రావు బుధవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలతో గండుగవల్లిలోని తుమ్మల నివాసంలో భేటీ అయ్యారు. తుమ్మలతో ఇరవై నిమిషాలు ఏకాంతంగా చర్చించారు. తాను 18న జరిగే కేసీఆర్ సభకు వస్తానని, సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు, గురువారం సీఎం జిల్లా పర్యటనలో కనిపించారు.
ఓ వైపు పొంగులేటి షాక్, మరోవైపు టీడీపీ రీ-ఎంట్రీ, తుమ్మల అసంతృప్తి నేపథ్యంలో కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతో తుమ్మలను బుజ్జగించే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారనే వాదన వినిపిస్తోంది.