ప్రకాశం: కొండపి పోలీస్ స్టేషన్‌ను కొండపి సీఐ జి సోమశేఖర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి కానిస్టేబుల్‌ను నియమించడం జరిగిందన్నారు. వారు గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామంలో జరిగే ప్రతి విషయాన్ని ఎస్ఐకి తెలపాలని అన్నారు.
కృష్ణా: ప్రణాళికయుతంగా డ్రైనేజీలు అభివృద్ధి చేసేందుకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషి చేస్తున్నారని కోడూరు డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ్ ప్రసాద్ తెలిపారు. గురువారం అవనిగడ్డ మండలం మోదుమూడి పరిధిలోని డ్రైనేజీలపై వచ్చే ఖరీఫ్ సీజన్ దృష్ట్యా చేపట్టవలసిన పనులను గుర్తించేందుకు ఏఈ కరీంతో కలిసి డ్రైనేజీలను పరిశీలించారు.
ప్రకాశం: అర్ధవీడు సచివాలయంలో సమయం 11గంటలు అయినా ఆఫీస్‌కు సిబ్బంది రాకపోవడంతో ప్రజలు ఆఫీస్‌కు వచ్చి వెను తిరగాల్సిన పరిస్థితి అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని స్థానికులు వాపోయారు. అధికారులు స్థానికంగా లేకపోవడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. సచివాలయలపై ఎంపీడీఓ పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం: సర్వాయపాలెంలో బుధవారం రాత్రి జరిగిన తిరుణాళ్ళలో టీడీపీ ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తాను ఉన్నంత కాలం వేగినాటి కోటయ్య పాలన సాగుతుందని అన్నారు. దాదాపు రూ.50 కోట్ల నిధులతో రోడ్లు, కాలువలు ఏర్పాటు చేశామని, రూ.83 లక్షలతో బాలుర, బాలికల హాస్టల్స్‌కి నిధులు మంజూరు చేయించామన్నారు.
ప్రకాశం: పొన్నలూరు మండల పరిధిలోని చుట్టూ పక్కల గ్రామాల్లో మూడు రోజులపాటు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల క్రికెట్ టోర్నమెంట్లు, ముగ్గుల పోటీలు, కబడ్డీ, చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించారు. కనుమ పండుగ సందర్భంగా పొన్నలూరులో చెంచు లక్ష్మి పౌరాణిక నాటకంతోపాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నాటకాన్ని చూడడానికి ప్రజలు తరలివచ్చారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ తరపు లాయర్ సోమా భరత్ అన్నారు. ఫార్ములా-ఈ రేస్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలిపారు. మాజీమంత్రి కేటీఆర్‌పై కక్షపూరితంగా కేసు పెట్టారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసు నమోదు చేశారని అన్నారు. కాగా, ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ను ఈడీ విచారిస్తోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా త్వరలో విడాకులు తీసుకోనున్నారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారిద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అందువల్లే ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి ఒబామా హాజరుకానుండగా.. మిచెల్ మాత్రం రావడం లేదని ఊహాగానాలు జోరందుకున్నాయి.
కోనసీమ: జిల్లా వాసుల చిరకాల వాంఛ కోటిపల్లి – నరసాపురం రైల్వేలైన్‌ను సమన్వయంతో సాధించి తీరుతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌లు వెల్లడించారు. రామచంద్రపురం వి.ఎస్.ఎం కళాశాల ప్రాంగణంలో మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి ఉత్సవ్ 2K25 సంబరాలు బుధవారం రాత్రితో ఘనంగా ముగిశాయి.
E.G: పెద్దాపురం సత్తెమ్మతల్లి జాతర మహోత్సవంలో భాగంగా బుధవారం రాత్రి తోలుబొమ్మలాట ప్రదర్శన ఆకట్టుకుంది. కనుమరుగవుతున్న తోలుబొమ్మలాటకు మళ్లీ జీవం పోయాలనే ఉద్దేశంతో తోలుబొమ్మలాట కళను జాతరల్లో ప్రదర్శిస్తూ పొట్ట పోసుకుంటున్నామని కళకారులు పేర్కొన్నారు. ఈ తోలుబొమ్మలాట కళలను పలువురు ఆసక్తిగా తిలకించారు.
HYD: శామీర్‌పేట్ PS పరిధిలో తండ్రిని కొడుకు హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. చీర విషయంలో తల్లీకూతుళ్ల మధ్య గొడవ జరగగా తల్లి చేయి తగిలి అక్వేరియం కింద పడింది. దీంతో తల్లిపై కొడుకు నర్సింహ రోకలి బండతో దాడి చేయగా అడొచ్చిన తండ్రి హన్మంత్ పై కూడా దాడి చేశాడు. తండ్రి తప్పించుకోగా వెంబడించి తండ్రిని ఇటుక రాయితో కొట్టి హత్య చేశాడు.
KKD: అనకాపల్లి జిల్లాలోని రేవు పోలవరం సముద్ర తీరంలో బుధవారం తునికి చెందిన బాలుడు మృతి చెందగా మరో యువకుడు గల్లంతయ్యాడు. కనుమ రోజు సరదాకోసం సముద్రతీరానికి వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. వీరిలో సాత్విక్(10) సముద్రంలోకి దిగి మునిగిపోయాడు. బాలుడిని తీసుకువచ్చేందుకు దిగిన కాకర్ల మణికంఠ(22) గల్లంతయ్యాడు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ముంబైలోని సైఫ్ నివాసంలో కత్తితో దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు.
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరిగే మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం పలు మార్గాల్లో నడిచే 4 ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈరోజు నుంచి ఈ నెల 28 వరకు సికింద్రాబాద్-దానాపూర్..18-25 వరకు ఎర్నాకుళం-పాట్నా మార్గంలోని రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల చొప్పున మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ చౌకీ మీదుగా దారి మళ్లించనున్నారు.
HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిషక్కు 3 రోజుల్లో మొత్తం 2,21,050 మంది సందర్శకులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి రోజు ఎక్కువగా 76,500 మంది నుమాయిష్కు రాగా..ఎగ్జిబిషన్లోని అన్ని స్టాల్స్ జనసంద్రంగా మారాయి.పాఠశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
SRPT: సాగు చేయని భూములను క్షేత్ర స్థాయి పర్యటనలలో గుర్తించి వారిని రైతు భరోసా పథకానికి అనర్హులుగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయంలో గ్రామాల వారీగా జరిగే క్షేత్ర స్థాయి పర్యటనల వివరాలను ఆయన పరిశీలించారు.