CTR: అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలుగా మార్చడమే లక్ష్యంగా ధైర్య స్పర్శ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చిత్తూరు క్రైమ్ పోలీస్ సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. పీవీకేఎన్ కాలేజీలో గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, వేధింపులు, డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థులకు వివరించారు.
BSK: బూర్గంపాడు మండలం మోతే పట్టి నగర్లో ఉపాధి హామీ పనిచేస్తున్న కార్మికులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్పుతో పాటు నిరుపేదలకు ఉపాధి హామీ లేకుండా చేయాలని కుట్ర పన్నుతుందని తెలిపారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.
BDK: బూర్గంపాడు మండలం పోలారం గ్రామంలో వర్సా రమణయ్య – సుజాత దంపతుల కుమారుడు రాజేష్ మరియు అక్షిత వివాహ వేడుకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు పట్టు వస్త్రాలు అందజేసి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
GDWL: జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని R&R కమిషనర్ శివకుమార్ నాయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 1000 ఎకరాల భూసేకరణ ముగిస్తే, నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లిస్తుందని వారు స్పష్టం చేశారు.
BHPL: స్తంభంపల్లి గ్రామంలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికురాలైన లక్ష్మి (40) తన భర్తకు నిన్న గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురై లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు SI మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
E.G: ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలో గురువారం మొత్తం 64 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 42,89,541 విలువైన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై కూటమి నాయకులతో చర్చించారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలో కోతుల దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణంలోని రెడ్డి కాలనీలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై కోతులు అకస్మాత్తుగా దాడులు చేశాయి. ఈ దాడిలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలో కోతుల తీవ్రత అధికంగా ఉందని, పలుమార్లు అధికారులకు, నాయకులకు తెలిపినా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు.
VZM: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కింద రూ. 20 వేలు అందిస్తున్నాయి. జిల్లాలో అర్హులైన రైతులకు మూడవ విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ నిధులను శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజా పాలన మొదలైంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఉచిత కరెంటు బిల్లు, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా ఇస్తున్నాం’ అని చెప్పారు.
NZB: తెలంగాణ యూనివర్సిటీ ఓరల్ డెంటల్ హెల్త్ స్క్రీనింగ్ & ఎడ్యుకేషన్ క్యాంప్‌ను గురువారం నిర్వహించారు. NSS సెల్ 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు హాజరై మాట్లాడారు. దంత పరీక్షలు, నోటి పరిశుభ్రత ఆరోగ్యకరమైన నోటి అలవాట్లను వివరించారు.
ASR: అడ్డతీగల ప్రభుత్వ హాస్పిటల్ నందు డాక్టర్ మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తగినంత నీరు తాగుతూ ప్రతీ రోజు వ్యాయామం చేయాలన్నారు. పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. శారీరక శ్రమ కిడ్నీల పనితీరుకు మేలు చేస్తుందన్నారు.
AKP: సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ అన్నారు. గురువారం చినగుమ్ములూరు సంపద కేంద్రాన్ని పరిశీలించి, పారిశుధ్య కార్మికులకు సూచనలు సలహాలు ఇచ్చారు. తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా వేరుచేయాలో వివరించారు. అనంతరం తిమ్మాపురం, రామయ్యపట్నంలో పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు.
జమ్మూలో మరో రెండు రోజుల పాటు పలుచోట్ల హిమపాతంతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారా, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లతో పాటు శ్రీనగర్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. నిన్న కుప్వారాలో 6.4 మి.మీ వర్షపాతం నమోదైందని, జోజిలా, జాంస్కర్‌లలో హిమపాతం నమోదైందని పేర్కొంది.
బీహార్‌కు చెందిన రితేష్ కుమార్ అనే యువకుడికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా వింత అనుభవం ఎదురైంది. ఈ నెల 15న జరగనున్న పరీక్ష కోసం హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోగా.. అందులో తన ఫోటో ఉండాల్సిన చోట కుక్క బొమ్మ రావడంతో రితేష్ షాక్‌కు గురయ్యాడు. రిక్రూట్‌మెంట్ బోర్డు చేసిన ఈ ఘోర తప్పిదంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
NLG: చిట్యాలలో జరుగుతున్న ఉచిత గాలికుంటు నిరోధక టీకాల కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ డా.జి.వి.రమేష్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్ రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాడి రైతులు తప్పనిసరిగా పశువులకు టీకాలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారులు డా.అభినవ్, డా.అమరేందర్, రైతులు పాల్గొన్నారు.