PDPL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి పట్టణాన్ని సందర్శించిన రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సహీద్ మసూద్ శానిటేషన్ పనులను పరిశీలించారు. 32వ వార్డులో శుభ్రత కార్యక్రమాలు, మినీ ట్యాంక్ బండ్, చందపల్లి నర్సరీలను పరిశీలించి మున్సిపల్ సేవలు మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. పట్టణ ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని పవనపుత్ర కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. శనివారం రాత్రి కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు వారు కాలనీలో పర్యటించిన సందర్భంగా వారిని అభయాంజనేయ స్వామి దేవాలయంలో కాలనీవాసులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐదవ డివిజన్ కార్పొరేటర్ లలితా భానుచందర్ తదితరులు పాల్గొన్నారు
NLG: ఇజ్రాయెల్, ఆమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ LPG గ్యాస్ స్టాక్స్ తగ్గినప్పటికీ జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఏలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరా లేదన్న సాకుతో జిల్లాలోని హాస్టళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల భోజనానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు.
NZB: మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు NZB ఏసీపీ బీ. ప్రకాష్ యాదవ్ తెలిపారు. ప్రధాన నిందితుడు, మృతుడి మేనల్లుడు దగ్గి సతీష్‌తో పాటు మరో ఆరుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కారు, మోటార్ బైక్, కమ్మకత్తి, ఏడు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిదన్నారు.
SRPT: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో మద్యం తరలింపు విషయంలో వివాదం తలెత్తి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం కోదాడ పట్టణంలోని ఓ వైన్స్ నుంచి మండలంలోని ఓ గ్రామానికి మద్యం తీసుకెళ్తుండగా గుడిబండ వైన్స్ నిర్వాహకులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి శనివారం రూ.3,63,024 ఆదాయం లభించింది. భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ సేవల ద్వారా ఈ మొత్తం సమకూరింది. టికెట్ల విక్రయాల ద్వారా రూ.1,74,228, ప్రసాదాల ద్వారా రూ. 1,40,430 ఆదాయం రాగా.. అన్నదానానికి భక్తులు రూ. 48,366 విరాళంగా అందజేశారు.
ATP: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు. జిల్లాలో 143 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, సుమారు 31 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్షలు ఉ.9:30 గంటలకు ప్రారంభమవుతాయని, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
VZM: జిల్లా పంచాయతీ అధికారి డీవీ మల్లికార్జున రావు శనివారం డెంకాడ మండలం జొన్నాడ పంచాయతీలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటి పన్ను వసూళ్లును పరిశీలించి, ఆ గ్రామంలోని ఒక ఇంటికి వెళ్లి ఇంటిపన్ను కట్టించి రసీదును ఇంటి యజమానికి అందజేశారు. అలాగే పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
SRCL: ఎల్లారెడ్డిపేట (M) కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈరోజు నుంచి ఉచిత యోగా తరగతులు సామాజిక కార్యకర్త దుంపెన రమేష్ నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగాసనాలు వేయిస్తామన్నారు. బీపీ, షుగర్, ఒత్తిడితో బాధపడేవారు, సీనియర్ సిటిజన్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిరిసిల్లకు చెందిన యోగ గురువు కృష్ణ హాజరవుతారని తెలిపారు.
KNR: అంధత్వం విజయానికి అడ్డు కాదని, సాధించాలనే తపన, ఆసక్తి, పట్టుదల ఉంటే అన్ని రంగాల్లో రాణించగలుగుతారని మానకొండూరు యువజన కాంగ్రెస్ శక్తి సూపర్ షి కో-ఆర్డినేటర్ గుమ్మడివల్లి రాజేశ్వరి అన్నారు. రేకుర్తి అందుల పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. పిల్లల్లో మానసిక స్థైర్యం నింపి వారి టాలెంట్‌ను గుర్తించి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు.
KMR: బాన్సువాడ జర్నలిస్టు కాలనీలో ఆరు నెలల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పట్లోల హనుమంత్ రెడ్డి ఇంట్లో రూ.2.50 లక్షల నగదు అపహరణకు గురవ్వగా, శనివారం శివాజీ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితుడి నుంచి రూ.45 వేల నగదు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నరు.
TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో ఏపీ ఏలూరు TDP ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 10 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. వీరందరికి డ్రగ్స్ టెస్ట్ చేయగా.. రోహిత్ రెడ్డితో సహా ఐదుగురికి పాజిటివ్ రాగా, టీడీపీ ఎంపీకి నెగటివ్ వచ్చింది.
NDL: బేతంచెర్ల మండలం ఆర్ఎస్.రంగాపురం గ్రామంలో పొలంలోని పైపులను పగలగొట్టిన ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఈడిగ పెద్ద మద్దిలేటి పొలంలోని పైపులను దండు మహమ్మద్, దండు మక్బూల్‌తో పాటు మరో ఐదుగురు కలిసి ధ్వంసం చేశారని ఎస్సై రమేష్ బాబు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
NGKL: తిమ్మాజిపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చేపడుతున్న పనులను టెక్నికల్ ఏపీవో సత్యనారాయణ పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న పని ప్రదేశాన్ని కూలీలకు దినసరి వేతనంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు రూ.307 వచ్చే విధంగా పనులు చేయాలని కూలీలకు తెలిపారు. ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు పనులు చేయాలని కోరారు.