PDPL: గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కల్పించాలని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక నేతలతో కలిసి శనివారం ఆస్పత్రికి వెళ్లి వైద్యాధికారి అంబికకు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టించే కార్మికులకు సరైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ATP: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను ఆర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూ సమస్యలపై ఆర్జీలను రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలని పేర్కొన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్ సద్దులగుండులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కార్పొరేటర్ లక్ష్మీ నరేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
KKD: పాపికొండల అభయారణ్యం వదిలి పులి జనావాసాల్లోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ప్రస్తుతం కాకినాడ జిల్లా శంఖవరం ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. గతంలో అధికారులు పట్టుకుని అడవిలో విడిచినా, సులభంగా వేట దొరుకుతుండటంతో మళ్లీ గ్రామాల బాట పట్టింది. రేడియో కాలర్ ద్వారా అటవీ శాఖ దీన్ని పర్యవేక్షిస్తున్నారు.
MNCL: అభయారణ్యంలో వన్యప్రాణులకు రక్షణ కరువై మృత్యువాత పడుతున్నాయి. తాళ్లపేట రేంజ్‌లో వేటగాళ్లు చిరుత పులిని హతమార్చడం పెద్ద చర్చంశనీయంగా మారింది. కోతులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలలో చనిపోతున్నాయి. దుప్పులు, జింకలు గ్రామ శివారులకు వచ్చి కుక్కల దాడిలో మృతి చెందుతున్నాయి. వేటగాళ్ల ఉచ్చులో పులులు, చిరుత చనిపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
NRPT: నారాయణపేట జిల్లా భూనీడ్ గ్రామంలో అరబిందో హెల్త్ కేర్ లిమిటెడ్ సహకారంతో శనివారం త్రాగునీటి శుద్ధి కేంద్రం RO ప్లాంట్‌ను ఎంపీ డీకే అరుణ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ప్రజలు కలుషిత నీరు త్రాగి అనారోగ్యానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో భూనీడ్‌లో త్రాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. దీనిని శుభ్రంగా కాపాడుకోవాలని కోరారు.
ELR: పెదపాడు గ్రామానికి చెందిన నేలగట్ల నరసింహారావు 36 అనే వ్యక్తి గత కొంతకాలంగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ.. ఈనెల 5వ తేదీన మృతి చెందాడు. ఆ కుటుంబ పరిస్థితిని గ్రామ పెద్దలు, పెదపాడు ఎస్సై ఆర్. శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. మృతుని దశదిన కార్యక్రమం నిమిత్తం పెదపాడు పోలీస్ స్టేషన్ తరఫున 75 కిలోల 3 బియ్యం బస్తాలను అందజేసినట్లు తెలిపారు.
కోనసీమ: గ్రామాలలో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలమూరు ఎస్సై నరేంద్ర అన్నారు. మండలంలోని చింతలూరులో ఆయన శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఉగాది సందర్భంగా నిర్వహించే శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. గ్రామంలో అనుమానితులు కన్పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
PDPL: ముత్తారం మండలం ఖమ్మంపల్లి – తాడిచర్ల వంతెన వద్ద మానేరు వాగు ఎడారిగా మారింది. మానేరు వాగుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవి ఎండలు ముదరకముందే చిన్నపాటి ప్రవాహం కూడా కనుమరుగై ఇసుక తిన్నెలు తేలాయని వాపోతున్నారు. మరికొద్దిరోజుల్లో నిండు వేసవి దృష్ట్యా సాగునీటి ఎద్దడికి అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు.
WGL: MGM ఆసుపత్రి సమీపంలోని సిరి మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా హెచ్-1 (మత్తు కలిగించే) ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారానే సమాచారం మేరకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్ కుమార్, శ్రవణ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయించవద్దన్నారు.
TG: యాదాద్రి జిల్లా తక్కపురంలో ఓ తల్లి కుమార్తె, కుమారుడిని కత్తితో పొడిచింది. కుమార్తె క్రితిరెడ్డి(14) మృతిచెందగా, కుమారుడు అశాంత్ రెడ్డి(11)కి గాయాలయ్యాయి. పుట్టింటి నుంచి వచ్చిన నీలిమ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా భర్త నరేందర్ రెడ్డి, నీలిమ మధ్య గొడవలు ఉన్నాయి. కుటుంబ తగాదాలతో పిల్లలను నీలిమ పొడిచినట్లు తెలుస్తోంది.
HYD: అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేశాడు ఓ నేపాలీ వ్యక్తి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లోని అనిరుధ్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో నెల రోజుల క్రితం పని కోసం వచ్చిన ఓ నేపాలీ మహేశ్ జోషే నమ్మకంగా ఉంటూ భారీ చోరీ చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి 8 డైమండ్ నెక్లెస్‌లతో పాటు, 10రోలెక్స్ వాచ్‌లు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
NGKL: పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలిసిన పిలిస్తే పలికే భక్తుల కొంగుబంగారంగా పిలువబడుతున్న శ్రీశ్రీశ్రీ పబ్బతి అంజనేయ స్వామినీ శనివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో రూ. 4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
SRCL: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. సిరిసిల్లలోని నెహ్రూ నగర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిరంతరం మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంలో మహిళలందరూ సభ్యులుగా చేరాలన్నారు.
WGL: వర్ధన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స కోసం 100 మంది వస్తారు. ప్రజలకు అత్యవసరమైన సమయంలో మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రిలో తరలించేందుకు కేటాయించిన అంబులెన్సులు పాడైపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి పాడైపోయిన అంబులెన్స్‌కు మరమ్మతు చేయించి ప్రజలకు అత్యవసరమైన సేవలు అందించాలని కోరారు.