దక్షిణాదికి గేట్‌వే గా భావిస్తున్న తెలంగాణలో ఈసారి ఎలాగైన అధికారంలోకి రావడానికి బీజేపీ శాయశక్తులా పని చేస్తోంది. పక్కా గేమ్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ తమకు అంతగా బలం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బలమైన అభ్యర్థులను దరి చేర్చుకోవడం, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశనం, ఎన్నికల కోసం పది నెలల రోడ్డు మ్యాప్, విపక్షాలలోని కుమ్ములాటలను అవకాశంగా మలుచుకోవడం, తెలంగాణ ప్రజల దృష్టి తమ వైపుకు తిప్పుకునే కార్యక్రమాలు… ఇలా ఎన్నో అంశాల ద్వారా తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, సాలు దొర, సెలవు దొర అంటూ నినాదాన్ని అందుకున్నది. 2018లో 100 స్థానాల్లో కనీసం డిపాజిట్ దక్కించుకోలేని బీజేపీ, ఈ మూడున్నరేళ్లలో మాత్రం బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయంగా కనిపించే స్థాయికి తీసుకు వెళ్లింది.
కేసీఆర్ వరుసగా రెండోసారి గెలిచారు. ఒకవిధంగా చెప్పాలంటే రెండుసార్లు తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించి విజయం సాధించారు. కానీ అనేక వైఫల్యాల నేపథ్యంలో మూడోసారి ఇది పని చేయదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్ళడంతో రెండో స్థానం నుండి మూడో స్థానానికి పడిపోయిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న సామాన్య ఓటర్లు, బీజేపీ దిశగా చూస్తారని ఆ పార్టీ ధీమాగా ఉందని అంటున్నారు. అందుకే 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రకాల పావులను ఉపయోగించుకుంటోంది. 2018లో 100 స్థానాల్లో డిపాజిట్ దక్కని చోట 90 సీట్లను టార్గెట్‌గా పెట్టుకుందంటే బీజేపీ ఎంత ప్రణాళికతో ముందుకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో 119కి కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచిన బీజేపీ, అధికారంలోకి వస్తుందా అని ఎగతాళిగా మాట్లాడే వారికి 2013లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయని బీఆర్ఎస్, ఆ తర్వాత ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్నదంటూ పలు ఉదాహరణలు చూపిస్తోంది.
పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తోంది. 10 నెలల రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకొని, అందుకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. 119 స్థానాలకు గాను తమ పార్టీ 45 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుంది లేదా గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న బీజేపీ, ఆ స్థానాలు చేజారకుండా ప్రణాళికలు గీస్తోంది. రెండో స్థానంలో ఉన్న మరో 45 స్థానాల్లో కొన్ని సీట్లయినా గెలిచే దిశగా స్థానిక నాయకత్వానికి దిశా నిర్దేశనం చేసింది. నిత్యం కార్యకర్తలతో భేటీ కావడం, ఓటర్లను కలవడం చేయాలని సూచిస్తోంది. పాతబస్తీ పైన కూడా కన్నేసిన బీజేపీ, అక్కడ ఒకటి రెండు స్థానాలలో అయినా మజ్లిస్ పార్టీకి గండి కొట్టాలని భావిస్తోంది. అక్కడి హిందూ ఓటర్లతో పాటు స్థానిక నాయకుల ద్వారా ఇతర మైనార్టీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
తెలంగాణలో అటెన్షన్ కోసం గత జూలై నెలలో హైదరాబాద్‌లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇటీవల బీఎల్ సంతోష్ హైదరాబాద్ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ 2022లో నాలుగుసార్లు తెలంగాణలో పర్యటించారు. అమిత్ షా కూడా రావడం, ఢిల్లీ నుండి నేతలకు దిశా నిర్దేశనం చేస్తున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా వంటి వారు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు. అంతేకాదు, తెలుగు నటులు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, క్రికెటర్ మిథాలీరాజ్ వంటి వారిని కలుస్తూ అటెన్షన్‌ను తమ వైపు డైవర్ట్ చేసుకుంటున్నారు. బీజేపీ అధిష్టానం 2022లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులోను కర్నాటకలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణలో గెలిచే పట్టుదలతో ముందుకు సాగుతోంది.
పార్టీకి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో రెండు మూడేళ్లలోనే పార్టీ బలంగా మారింది. కానీ ఆయా నియోజకవర్గాల్లో తమకు బలమైన నేతలు లేని లోటు బీజేపీకి కనిపిస్తోంది. అందుకే తమ బలానికి ఆర్థిక బలం, ప్రజాబలం కలిగిన నేతలు కావాలని భావించి, ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ వంటి వారిని తీసుకున్నది. పార్టీకి బండి సంజయ్ వంటి దూకుడైన నేత, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రాణి రుద్రమ వంటి వాగ్ధాటి కలిగిన నాయకులు ఉన్నారు. కానీ ఆయా పార్టీల్లో గెలిచే వారి కోసం అన్వేషిస్తోంది.. కొనసాగిస్తోంది. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు వంటి వారితో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలోని అసంతృప్తులకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది.
మరి పక్కా గేమ్ ప్లాన్‌తో, గట్టి కేడర్‌కు బలమైన నేతలను కలుపుకునే ప్రయత్నంతో ముందుకు సాగుతున్న కమలం పార్టీ 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అధికార లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుందా అనేది చూడాల్సిందే.!