పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే.. మిగతా హీరోల సినిమాలు రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు మేకర్స్. ఒకవేళ రిస్క్ చేసి రిలీజ్ చేస్తే మాత్రం.. నిజంగానే రిస్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే.. సినిమా బాగున్నా పెద్ద హీరోల మధ్యలో కొట్టుకుపోవడం ఖాయం. అందుకు ఉదాహరణగా ఇటీవల దసరాకు వచ్చిన ‘స్వాతిముత్యం’ అనే సినిమానే చెప్పొచ్చు. మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’, నాగ్ ‘ది ఘోస్ట్’ సినిమాలకు పోటీగా ఈ సినిమా రిలీజ్ అయింది.
అయితే స్వాతిముత్యంకు పాజిటివ్ టాక్ వచ్చినా.. చిరు, నాగ్ మధ్యలో నిలబడలేకపోయాడు. ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా ఇలాగే చేస్తున్నాడా.. అనే సందేహం రాక మానదు. పైగా చిరు, బాలయ్య, ప్రభాస్, విజయ్ వంటి స్టార్ హీరోలతో పోటికీ సై అంటున్నాడు. మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’.. బాలయ్య ‘వీరసింహారెడ్డి’.. విజయ్ వారసుడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ జనవరి 12న ఎప్పుడో లాక్ అయిపోయింది.
అయినా కూడా ఏజెంట్(agent) మూవీని సంక్రాంతికి వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న’ఏజెంట్’ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు అఖిల్. అదే నమ్మకంతో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడు. కానీ నిజంగానే అఖిల్ స్టార్ హీరోల పోటీని తట్టుకుంటాడా.. అనేది డౌటే. సినిమా కంటెంట్ బాగున్నా.. ఫస్ట్ థియేటర్ ప్రయార్టి బడా హీరోలకే ఉంటుంది. పైగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి డీసెంట్ హిట్ ఉన్న అఖిల్.. మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తాడా.. అనేది ఇప్పుడే చెప్పలేం. ఎంత కాదనుకున్నా.. ఏజెంట్‌కు సోలోగా వచ్చే ఓపెనింగ్స్ రాకపోవచ్చు. కాబట్టి అఖిల్(hero akhil) రిస్క్ చేస్తున్నాడనే చెప్పొచ్చు.