Israel-Palestina War: విషాదం..ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో 11,000 మంది మృతి
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం వల్ల ఇప్పటి వరకూ 11 వేల మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఈ యుద్ధం ప్రారంభమై రేపటితో నెల రోజులు పూర్తవుతుంది. యుద్ధం కారణంగా చిన్నారులు, మహిళలే అధిక సంఖ్యలో మృతిచెందారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం (Israel-Palestina War) ప్రారంభమై రేపటితో నెల రోజులు పూర్తికానుంది. ఇంకా ఈ యుద్ధం ఆగలేదు. ఈ భీకర యుద్ధం వల్ల చాలా మంది అమాయకులు ప్రాణాలు విడిచారు. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదులు యుద్ధం సాగించడం వల్ల అభంశుభం ఎరుగని వారు బలి అవుతున్నారు. ఈ యుద్ధం వల్ల ఇప్పటి వరకూ 11000 మందికి పైగా మరణించారు.
అక్టోబర్ 7వ తేదిన హమాస్ (Hamas) ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై 5 వేల రాకెట్లతో దాడికి దిగారు. ఆ దాడి వల్ల వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. పాలస్తీనా, గాజాలపై యుద్ధం తీవ్రతరం చేసింది. ఇరు పక్షాల దాడులు ఎక్కువయ్యాయి. యుద్దంలో ఇజ్రాయెల్ కారణంగా గాజాకు చెందిన 10 వేల మందికి పైగానే చనిపోయారు. యుద్ధంలో అత్యధికంగా చిన్నారులు, మహిళలే మృతిచెందారు.
యుద్ధం (War) కారణంగా ఇప్పటి వరకూ 4 వేల మందికిపైగా చిన్నారులు చనిపోయినట్లుగా అల్ జజీరా నివేదిక వెల్లడించింది. వీరే కాకుండా శిథిలాల కింద ఇంకొంత మంది చిక్కుకుని ఉన్నారని, సుమారు 2 వేల మందికి పైగానే శిథిలాల కింద ఉన్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. ఇజ్రాయెల్ చేసిన దాడిలో పాలస్తీనా ప్రజలు 25 వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. అలాగే ఈ యుద్ధం కారణంగా గాజా ప్రాంతం నుంచి సుమారు 15 లక్షలకు పైగా ప్రజలు ఇతర దేశాలకు తరలి వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి (United Nations) వెల్లడించింది.