తెలంగాణలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఆత్మహత్యలు లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, మాజీ ఎంపీ జయరామ్ పంఘి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన చేరికల కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
‘అమెరికా, చైనా కంటే మనదేశంలోనే సంపద అధికంగా ఉంది. కానీ ఆ రెండు దేశాలు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయి? మనం ఈ 75 ఏల్లలో మనం ఏం సాధించాం?. దేశంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. తాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నాం. అందుకే దేశ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ పుట్టింది. ఈ మహాసంగ్రామంలో మనతో గవాంగ్ కలిసి వస్తున్నారు. ఒడిశాలో అన్ని నదులు ఉన్నా తాగునీరు అందడం లేదు. మహారాష్ట్రలో సంపద లేదా? జాతి, ధర్మం పేరు చెప్పి ఒట్లు అడిగిన వాళ్లు గెలిచి ఏం చేస్తున్నారు? కొందరికి దౌర్జన్యంగా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది’ అని కేసీఆర్ తెలిపారు.
‘ఎక్కడైనా ఎన్నికల్లో గెలిస్తే సమాజ సేవ లక్ష్యంగా ఉంటుంది. ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారు కానీ ప్రజలు ఓడుతున్నారు. ఎన్నికల్లో పార్టీలు, నేతలు కాదు ప్రజలు గెలవాలి. ఎన్నికల్లో ప్రజలు గెలవడమే అసలైన ప్రజాస్వామ్యం. ఎన్నికల్లో ప్రజలు గెలిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ మార్పు తెలుస్తుంది. భారతదేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. పరివర్తన సమయంలో చాలా మంది ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తారు. అసలు దేశంలో రైతులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతులు కూడా చట్టసభల్లోకి రావాలి. అందుకే హర్ ఏక్ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నాం. గతంలో తెలంగాణ నుంచి ఉపాధి కోసం మహారాష్ట్రకు వలస వెళ్లేవారు. కానీ ఇప్పుడు వలస వెళ్లిన వాళ్లు తిరిగి వస్తున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవు. తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం. తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్ర, ఒడిశాలో ఎందుకు కాదు. ఆర్థిక సమస్యలు కాదు చిత్తశుద్ధి లోపం వల్లనే సమస్యలు. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమవుతాయి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒడిశాకు చెందిన పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. వారికి పార్టీ అధినేత కేసీఆర్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.