వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న తల్లి తన ప్రియుడితో కలిసి ముగ్గురు పిల్లల్ని యాదాద్రిలో వదిలేసి వెళ్లిపోయింది. బలవంతంగా అర్ధరాత్రి ఆటోలో తీసుకొచ్చి యాదాద్రి ఆలయం సమీపంలో వదిలేసింది. వారి సొంత తండ్రి గతంలోనే వదిలేసి వెళ్లడం.. ఇప్పుడు తల్లి ప్రియుడితో కలిసి గెంటేయడంతో అభంశుభం తెలియని చిన్నారులు యాదాద్రిలో తీవ్ర చలిలో గజగజ లాడుతూ కనిపించారు. పిల్లలను దయనీయ స్థితిని గుర్తించిన పోలీసులు చేరదీయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ కు చెందిన బాబురావు, లక్ష్మికి 12 సంవత్సరాల కిందట ప్రేమ వివాహం జరిగింది. కొన్నాళ్లు వీరి కాపురం సవ్యంగా సాగింది. వీరికి ముగ్గురు (10, 5, 2) కుమారులు, ఒక కుమార్తె (8) ఉన్నారు. అయితే కొన్నాళ్లకు వీరి మధ్య విబేధాలు వచ్చాయి. తరచూ గొడవలు జరుగుతుండడంతో ఒకరోజు బాబురావు భార్య లక్ష్మి, పిల్లలను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు భార్య లక్ష్మి ఓ ఆటో డ్రైవర్ తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. అనంతరం పెళ్లి చేసుకున్నారు. అయితే నలుగురు పిల్లలు తమకు అడ్డొస్తున్నారని భావించి వారిని వదిలేసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఈనెల 14వ తేదీన అర్ధరాత్రి లక్ష్మి, తన భర్తతో కలిసి పిల్లల నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు, కాళ్లు కట్టేసి ఆటోలో యాదాద్రికి చేరుకున్నారు. అర్ధరాత్రి వారిని యాదాద్రి గుట్ట కింద వారిద్దరూ పిల్లలను వదిలేసి వెళ్లిపోయారు.
చిన్నారులు ఎలాగోలా కట్లు విప్పుకుని యాదాద్రిలో తిరుగుతున్నారు. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పాశం కోటి చిన్నారులను గమనించారు. వారి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తల్లి తమను వదిలేసి వెళ్లిందని పిల్లలు చెప్పారు. పెద్దనాన్న వివరాలు చెప్పగా.. ఆయనకు ఫోన్ చేస్తే తనకు సంబంధం లేదని చెప్పేశాడు. ఆ చిన్నారులను వివిధ ప్రాంతాల్లోని శిశు విహార్ కేంద్రాలకు తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.