తెలంగాణలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన మరువకముందే వరంగల్ జిల్లాకు చెందిన మరో వైద్యురాలు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది.
ఖమ్మం జిల్లాలో మమత మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని సముద్రాల మానస(22) ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన సముద్రాల మానస ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. కాలేజీ సమీపంలోని హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హాస్టల్ గదిలో మానస శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి తెలిపారు. వెంటనే రూమ్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేసరికి నష్టం జరిగిపోయింది. మంటల్లో మానస కాలిపోయినట్లు నిర్ధారించారు. హాస్టల్ యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వైద్య విద్యార్థిని మానస ఆత్మహత్యకు ముందు పెట్రోల్ బంకుకు వెళ్లింది. మానస పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు ఈ విషయం తెలిసింది. వైద్య విద్యార్థిని మానస స్వస్థలం వరంగల్ కాగా ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె గదిలో ఎలాంటి లేఖ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇటీవల యువతి తండ్రి మృతి చెందగా..తననే తలుచుకుని బాధపడినట్లు తెలిసింది.
వరంగల్ జిల్లాకు చెందిన ప్రీతి అనే వైద్య విద్యార్థిని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ప్రీతి తానూ విష ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించగా వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్న ప్రీతికి నాలుగైదు రోజులు చికిత్స అందించి చివరకు బ్రెయిన్ డెడ్ అయింది. చివరకు ప్రీతి చనిపోయిందని ఆసుపత్రి ప్రకటించింది.