మన్యం: పాలకొండ-లుంబూరు మధ్య ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. రహదారిపై రాళ్లు తేలిపోవడంతో ప్రయాణం కష్టంగా మారి, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణానికి నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ATP: ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు లభించిన సందర్భంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ సంస్థ డైరెక్టర్ మాంచో ఫెర్రర్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురంలోని ఆర్డీటీ కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో ఆర్డీటీ సేవలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
CTR: బంగారుపాలెం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో శనివారం ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. బెంగుళూరు నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వరంగల్‌కు చెందిన దంపతులు శ్రీధర్ రావు, లక్ష్మి వారి కుమార్తె ఆద్విక అక్కడికక్కడే మృతి చెందారు.
KRNL: ఆదోని పట్టణంలో ఆస్తి పన్ను పాత బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ మాఫీని వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ ప్రజలను ఇవాళ కోరారు. ఈ రాయితీ ఈనెల 30 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. గడువు సమీపిస్తున్నందున సెలవు రోజుల్లోనూ నగదు కౌంటర్లు తెరిచి ఉంటాయని, బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమీషనర్ వెల్లడించారు.
NDL: నంద్యాల మండలం పుసులూరు గ్రామంలో ఇవాళ వైసీపీ సీనియర్ నాయకుడు పుల్లయ్య అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గ్రామానికి చేరుకుని మృతుడు పుల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు.
W.G: మార్టేరు బస్టాండ్ ప్రాంతంలో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరగడంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం, భీమవరం వెళ్లే కూడళ్లలో కుక్కలు గుంపులుగా ఉండి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. బస్సులు ఎక్కే సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
KDP: సింహాద్రిపురంలో ఇవాళ తెల్లవారుజామున కారు బోల్తా పడి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపు తప్పి అరటి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: మార్చి 16 నుంచి కొనసాగుతున్న పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద పోలీసుల పర్యవేక్షణ పెంచారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై కఠిన తనిఖీలు, సెక్షన్ 144 అమలు, మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేశారు.
అన్నమయ్య: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో అసంపూర్తి డేటాను మార్చి 31 లోగా పూర్తి చేయాలని చిట్వేలి మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు ఆదేశించారు. చిట్వేలిలో ఆయన మాట్లాడుతూ.. స్వర్ణ గ్రామం సిబ్బంది ప్రతి కుటుంబం వివరాలను ఖచ్చితత్వంతో నమోదుచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా డేటాను అప్డేట్ చేయాలని ఆదేశించారు.
KKD: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-19 బాలుర క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు ఏప్రిల్ 1న కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రికెట్ మైదానంలో నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు తలాటం హరీష్, నక్కా వెంకటేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, 2007 ఆ తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు.
VZM: గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు వేదుల భువనేశ్వర ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చకులు చంద్రమౌళి శర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని భక్తులు తిలకించారు.
SS: నల్లమాడ మండలం దొన్నికోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హుండాయ్ మొబిస్ ఇండియా సంస్థ CSR కింద భారీ విరాళం అందజేసింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యంగ్ యుయోంగ్ జూక్ ఆధ్వర్యంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు కోసం 20 కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలతో పాటు ఫ్యాన్లు, లైట్లను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయ బృందం సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వేచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్సై సందీప్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి ఒంగోలు బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయ వద్దన్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్సై సందీప్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి ఒంగోలు బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయ వద్దన్నారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని కీలకమైన నరసాపురం పోలీస్ సబ్ డివిజన్‌కు గత కొంతకాలంగా పూర్తిస్థాయి డీఎస్పీ లేక వెలవెలబోతోంది. ఫిబ్రవరి 26న డాక్టర్ శ్రీవేద బదిలీ అయినప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. పది పోలీస్ స్టేషన్ల పరిధిలోని శాంతిభద్రతల పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కీలకమైన ఈ సబ్ డివిజన్‌కు వెంటనే అధికారిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.