ఏపీలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై సొంత పార్టీ నాయకులే తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఈ ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా అలుముకుంది. పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు ఇది బహిర్గతమవుతోంది. అందుకే తరచూ మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ కాల్స్ రికార్డు చేస్తున్నారని, తన ఫోన్ ట్యాప్ కు గురైందని ఆరోపించారు. పార్టీ తీరుపై కూడా మండిపడ్డారు.
ఈ విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే సీఎం జగన్ కు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. అందుకే ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేశారని చర్చ కొనసాగుతున్నది. ప్రస్తుతం పార్టీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు, అనుచరులతో విడివిడిగా సమావేశమయ్యారు. వారి దగ్గర తన అభిమతాన్ని, ఆవేదనను వెల్లడించినట్టు సమాచారం.
పార్టీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని కార్యకర్తలతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి పార్టీ తరఫున పోటీ చేస్తే తాను పోటీ చేయలేనని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. తమ్ముడికి పోటీగా తాను నిలబడనని పేర్కొన్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని ప్రకటించినట్లు ఓ కార్యకర్త తెలిపాడు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. దీంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని కార్యకర్తలతో చెప్పుకొచ్చారు. అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని పేర్కొనడంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి త్వరలో వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి పోయినప్పటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇంతకుముందులా పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా కనిపించడం లేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. త్వరలోనే ఈ అసంతృప్తి అంతా బడబాగ్నిలా పేలుతుందని నెల్లూరులో చర్చ నడుస్తోంది. వెంటనే పార్టీ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టమని ఓ సీనియర్ నాయకుడు తెలిపాడు.