ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని పార్టీల ముఖ్య నేతలు… తమ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. చంద్రబాబు సైతం.. పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో సరిగా పని చేయని నేతలకు వార్నింగ్ లు కూడా ఇస్తున్నాయి. ఇలా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని బాధతో… రాజానగరం టీడీపీ ఇన్ ఛార్జ్ పదవికి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రాజీనామా చేశారు.
గతంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాపై అసహనం వ్యక్తం చేయటం వల్లే ఇన్ చార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నానని అయినా టీడీపీలోనే కొనసాగుతానని పార్టీ మారనని పెందుర్తి వెంకటేష్ పేర్కొన్నారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపిస్తానని పేర్కొన్నారు. ఆయన 2009 నుంచి రెండు పర్యాయాలు టిడిపి ఎమ్మెల్యేగా పనిచేశారు.2009, 2014లో ఎమ్మెల్యేగా పనిచేసిన వేంకటేష్, 2019లో ఓటమి తరువాత నియోజకవర్గానికి దూరమయ్యారనేది అక్కడి వారు చెప్పే మాట. ఆది నుంచీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ఉండడంతో అధినేత చంద్రబాబు ఆయన మీద ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.
నిజానికి 2004 ఎన్నికల్లో వేంకటేష్ భార్య అన్నపూర్ణ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా బరిలో నిలిచినా అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన చిట్టూరి రవీంద్ర చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆ ఓటమి తరువాత నియోజకవర్గంలో వేంకటేష్ విస్తృతంగా పర్యటించడమే కాక ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా స్వయంగా హాజరై జనంతో బాగా కలిసిపోయారు. ఆ ప్రభావం 2009, 2014 ఎన్నికల్లో పనిచేసి, వెంకటేష్ గెలుపునకు బాటలు వేసిందని విశ్లేషకుల వాదన. అయితే వరుసగా రెండు సార్లు గెలివడం తనదైన ప్రత్యేక కోటరీకే వేంకటేష్ పరిమితమయ్యారన్న ఆరోపణలు ఆయనకు బాగా మైనస్ అయ్యాయి. జనానికి దూరం కావడం వల్లనే 2019లో 30వేలకుపైగా భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని విశ్లేషకులు చెబుతూ ఉంటారు.