జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ది పక్కా ప్యాకేజీ రాజకీయమేనని అంబటి రాంబాబు శుక్రవారం నిప్పులు చెరిగారు. తాను సింగిల్‌గా వెళ్తే రాజకీయంగా వీరమరణమని తనకు కూడా అర్థమైందన్నారు. పోరాడే దమ్ములేక, విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు చెబుతుంటే దానిని భరించలేక ఇష్టారీతిన మాట్లాడటం ఏమిటన్నారు. అసలు పవన్ చేసిన పోరాటం ఏమిటన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి మీద కూడా పోరాటం చేశానని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. వైయస్, జగన్ వంటి ఏనుగులు మొరుగుతుంటే నీలాంటి కుక్కలు మొరుగుతూనే ఉంటాయన్నారు. పవన్‌ది అసలు నోరేనా అన్నారు.
నా అంత సంస్కారవంతమైన నాయకుడు లేడు అంటూనే, మంత్రులను దూషించడమేమిటన్నారు. పొత్తులో భాగంగా తన గౌరవానికి తగినట్లు ఉండాల్సిందేనని చెప్పారని, మరి గౌరవం అంటే ఏమిటో చెప్పాలని.. ఆ గౌరవానికి అర్థం ప్యాకేజీయే అన్నారు. తగినంత ప్యాకేజీ గౌరవం, బరువైన గౌరవం ఇస్తే కలిసి పోటీ చేస్తానని, లేదంటే సొంతగా పోటీ చేసి వీరమరణం పొందుతాననేది జనసేనాని ఉద్దేశ్యమన్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్లు, పవన్ మాటలకు కూడా అర్థాలు వేరుగా ఉంటాయన్నారు.
జనసైనికులు, వీరమహిళలు, ప్రజలు గ్యారంటీ ఇస్తే తాను సొంతగా పోటీ చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గ్యారెంటీ కార్డు వెతుక్కునే పరిస్థితుల్లో జనసేన ఉందని, కానీ రాజకీయాల్లో ధైర్యంగా వెళ్లగలిగే సత్తా కలిగి ఉండాలన్నారు. కష్టానికి, నిష్టూరానికి సిద్ధంగా ఉండాలని, అలాంటప్పుడు రాజకీయాలు ఎందుకు ప్రారంభించాలన్నారు. ప్రజలు నిన్ను నమ్మితే ఓటు వేస్తారని, కానీ మీరు ఓటు వేస్తే నేను పోటీ చేస్తానని చెప్పడం విడ్డూరమన్నారు.
తెలుగు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కామెడీ పీస్ అని అందరికీ అర్థమైందని, దగ్గరకు వస్తే చెప్పు తీసుకొని కొడతానని వ్యాఖ్యానించడానికి ఇంగితజ్ఞానం ఉండాలన్నారు. రాజకీయాల్లో సద్విమర్శలు ఉండాలన్నారు. ప్యాకేజీ తీసుకొని పవన్ మాట్లాడుతున్నారన్నది నూటికి నూరు పాళ్లు నిజమన్నారు. జగన్ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా నిలబడ్డాడని, 16 నెలలు జైలుకెళ్లినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారన్నారు. నన్ను గెలిపిస్తారా ప్రజలను గ్యారెంటీ కార్డు అడిగే దౌర్భాగ్య రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు.
జగన్‌ను మూడు ముక్కల ముఖ్యమంత్రి అని విమర్శించేందుకు మూడు ముళ్ల పవన్‌కు హక్కు ఎక్కడిదన్నారు. నాగబాబుకు కూడా విమర్శించే హక్కు లేదన్నారు. సినిమా వ్యామోహంతో మీ వెంట నడిచే యువతకు నష్టం చేసేందుకు, చంద్రబాబుకు అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నారన్నారు. మీరు ఒంటరిగా వచ్చినా, కలిసి వచ్చినా గెలవలేరన్నారు. పిరికి సన్నాసుల్లారా మీకు దమ్ము, ధైర్యం లేదన్నారు. పవన్ వెళ్లే దారి సరైనది కాదని, జనసైనికులు తెలుసుకోవాలన్నారు.
పవన్ బయటకు రాగానే 10 మంది మంత్రులు, వైసీపీ నేతలు బయటకి వస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ ఇంతమంది బయటకు వస్తున్నారంటే మీకు నైతిక విలువలు, రాజకీయాల్లో విలువలు లేవని, కేవలం ప్యాకేజీ పైనే మాత్రమే మనసు ఉందన్నారు. ఇలాంటి చీడపురుగులకు ప్రజలు ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఓట్లు వేయరని, మీరు కలిసినా రాజకీయంగా నాశనం తప్పదన్నారు. బీజేపీతో సంబంధాలు ఎలా ఉన్నాయో పవన్ చెప్పాలన్నారు. పవన్ అమ్ముడుపోయేందుకే తాపత్రయపడుతున్నారన్నారు.
చంద్రబాబుతో పొత్తు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ రేపు జనసేనలో చేరే టీడీపీ వారికే టిక్కెట్లు ఇస్తారన్నారు. మీడియాలో తమపై వెటకారంగా వచ్చే కథనాలను తాము ఎంజాయ్ చేస్తున్నామన్నారు. జగన్, మేము ధైర్యవంతులమని, అసలు పవన్ పిరికివాడన్నారు. సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి జగన్ అన్నారు. నిజమైన ధైర్యవంతుడు తాను ప్రకటన చేయడని, చేసి చూపిస్తారన్నారు.