గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కాకుండా వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదని కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
ప్రతియేటా గణతంత్ర వేడుకలు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగేవి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఏడాదిన్నర నుంచి గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. గవర్నర్ పదవిని చిన్నచూపు చేస్తోంది. పాలన వ్యవహారాల్లో గవర్నర్ పాత్ర వీలైనంత తగ్గించే ప్రయత్నాలు సీఎం కేసీఆర్ చేస్తున్నారు. దీంతో గతేడాది గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాజ్ భవన్ కే పరిమితం చేసింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి చోటివ్వలేదు. ఇలా వీలైనంత మేరకు గవర్నర్ పాత్రకు ప్రాధాన్యం తగ్గిస్తోంది. తాజాగా గణతంత్ర వేడుకలపై కూడా అదే వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించడంతో గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా పేరుతో గణతంత్ర వేడుకలు నిర్వహించకపోవడం సరికాదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గవర్నర్ రాజ్ భవన్ లో జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లి అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో ఆమె జెండా ఎగురవేయనున్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని విమర్శించే అవకాశం ఉంది.