మొన్నటి వరకు న్యూఢిల్లీ, చండీగఢ్, గుజరాత్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన కండ్లకలక వ్యాధి..ఇప్పుడు తెలంగాణలో వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య దాదాపు 600 దాటేసింది. ఈ నేపథ్యంలో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని వైద్యులు తల్లిదండ్రలకు సూచిస్తున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాలలో కండ్లకలక(Conjunctivitis)కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో స్కూళ్లకు ఆగస్టు 2 వరకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ(telangana)లో కూడా ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి బాధితులు ప్రతి రోజు హైదరాబాద్ సరోజిని దేవి ఆస్పత్రికి క్యూ కడుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజలింగం తెలిపారు. రోజుకు 10కిపైగా ఈ వ్యాధిగ్రస్తులు వస్తున్నారని అన్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లా జైపూర్ గురుకుల పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఈ వ్యాధి బారిన పడ్డారు. దీంతోపాటు సిద్దిపేట జిల్లాలో సైతం ఈ కేసులు 140కిపైగా నమోదయ్యాయి. అంతేకాదు వర్గల్ నవోదయ విద్యాలయంలో కూడా 80 మందికిపైగా విద్యార్థులు కండ్ల కలక బారిన పడినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఆయా బాధితులు కళ్లద్దాలు ఉపయోగించాలని వైద్యులు(doctors) కోరారు. అయితే ఒకరి కళ్లలో ఒకరు చూడటం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందనే దాంట్లో నిజం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కానీ వారు ఉపయోగించిన వస్తువులు, చేతుల ద్వారా ఈ వైరల్ వ్యాధి ఎక్కువగా విస్తరిస్తుందని అన్నారు. అయితే వర్షకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల్లో విద్యార్థులు తరచుగా చేతులు కడుక్కోవడం, కళ్లను తాకకుండా ఉండటం, చేతి తువ్వాళ్లను దగ్గర ఉంచుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటివి చేయాలని కోరారు.
కండ్లకలక రోగికి సాధారణంగా కళ్ళు ఎర్రగా(eyes flu) మారడం, దురద, బాధాకరంగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి వైరస్లు, బాక్టీరియా లేదా అలెర్జీ కారకాల వల్ల సంభవిస్తుంది. కండ్లకలక అనేక రకాలుగా ఉంటుంది. బాక్టీరియా, వైరస్ లేదా అలెర్జీ వల్ల సంభవించవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ విషయంలో ఔషధం లేదా కంటి చుక్కల ద్వారా తక్షణ ఉపశమనం లేనప్పటికీ లక్షణాలు తగ్గేందుకు 1-2 వారాలు పడుతుంది. ఈ వ్యాధి పిల్లలకు త్వరగా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు.