రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలలు వేర్వేరుగా తమ తండ్రికి నివాళి అర్పించనున్నారు. జులై 8న వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు జగన్, షర్మిల చేరుకోనున్నారు. అయితే వీరిద్దరూ కలిసి రావడం లేదు. వేర్వేరుగా వీరి పర్యటన సాగనుంది. ఇప్పటికే షర్మిల ఇడుపులపాయకు చేరుకుంది.
శుక్రవారం రాత్రి వైఎస్ షర్మిల అక్కడే బస చేయనున్నారు. ఆ తర్వాత శనివారం ఉదయం తల్లి విజయమ్మ, కొడుకు, కూతురు, ఇతర కుటుంబీకులతో కలిసి ఆమె వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకోనున్నారు. ఆ తర్వాత తమ కుటుంబీకులతో కలిసి అక్కడే నివాళులర్పించనున్నారు. తిరిగి హైదరాబాద్కు శనివారం మధ్యాహ్నం బయల్దేరనున్నారు.
ఇకపోతే ఏపీ సీఎం జగన్ శనివారం మధ్యాహ్నం 1.55 గంటలకు ఇడుపులపాయకు చేరుకొని వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పిస్తారు. ప్రతి సంవత్సరం వీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం వేర్వేరుగా హాజరవుతున్నారు. గత కొంత కాలంగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి ఇడుపులపాయ సాక్షిగా ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.