Jithender Reddy: తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ పాలిటిక్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్సెస్ మరో నేత ఈటల రాజేందర్ మధ్య పొసగడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఇంతలో ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లడం.. ప్రచార కమిటీ చైర్మన్ పదవీ అని ఊరడింపు వార్తలు విన్నాం. బీజేపీ ముఖ్యనేత జితేందర్ రెడ్డి (Jithender Reddy) నివాసంలో ఈ రోజు నేతలు సమావేశం అయ్యారు. విజయశాంతి, వివేక్, కొండా సురేఖ, బూర నర్సయ్య గౌడ్, విఠల్, రవీంద్ర నాయక్, దేవయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈటల రాజేందర్ టార్గెట్‌గా సమావేశం జరిగినట్టు స్పష్టం అవుతోంది.
అలాంటి పదవులు లేవే..?
సమావేశం ముగిసిన తర్వాత జితేందర్ రెడ్డి (Jithender Reddy) మీడియా ముందుకు వచ్చారు. ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళతాం అని చెప్పారు. అభివృద్ధిని ఇంటింటికీ తీసుకెళతాం అని పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ చైర్మన్ పదవీ అంశంపై మాట్లాడారు. తమ పార్టీలో అలాంటి పదవులు లేవన్నారు. బీజేపీని ఈ స్థాయికి తీసుకొచ్చిందే బండి సంజయ్ అని.. తమ పార్టీలో అసంతృప్తులు అన్న మాటే లేదని తేల్చిచెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఊరికే మార్చబోరని స్పష్టంచేశారు. బీజేపీ శ్రేణులు గందరగోళానికి గురికావొద్దని సూచించారు. బీజేపీ అధ్యక్షుడి మార్పు.. బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవీ, బీజేపీ అధ్యక్ష పదవీ డీకే అరుణకు ఇస్తారనే వార్తలు వస్తోన్న నేపథ్యంలో జితేందర్ రెడ్డి స్పందించారు. తమ సమావేశం వెనక రహస్య ఎజెండా ఏమీ లేదని చెప్పారు.
కేసీఆర్ లీకులే..?
తమ పార్టీలో కొన్ని అంశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ లీకులు ఇస్తున్నారని జితేందర్ రెడ్డి (Jithender Reddy) మండిపడ్డారు. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం అని తెలిపారు. ఆ కుట్రలను పట్టించుకోవద్దని క్యాడర్‌ను కోరారు. ఏ విషయం అయినా సరే హైకమాండ్‌లో చర్చ జరిగిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. తమది జాతీయ పార్టీ అని.. ఓ విధానం ఉంటుందన్నారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశామని జితేందర్ రెడ్డి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం ఖాయం అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.