ప్రపంచంలో తాము అనేక రంగాల్లో దూసుకుపోతున్నామని చైనా (China) చెబుతున్నప్పటికీ… అక్కడి యువతలో గరిష్ఠ స్థాయి నిరుద్యోగిత రేటు నమోదయ్యింది. మునుపెన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌లో చైనా యువత నిరుద్యోగిత రేటు (Unemployment rate) 20.4 శాతంగా రికార్డయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.16 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వారు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. పని లభించకపోవడాన్ని యువ నిరుద్యోగితగా వ్యవహరిస్తారు. కొవిడ్ (Covid) ఆంక్షల నుంచి ఇటీవలే బయటకు వచ్చిన చైనాలో.. అక్కడి యువతలో నిరుద్యోగానికి సంబంధించి ‘చైనా అకాడమీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ సెక్యూరిటీ’ తాజా నివేదిక వెల్లడించింది. ఇది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 20.4 శాతం గరిష్ఠానికి చేరుకుంది. అంతకుముందు నెలలో 19.6 శాతంగా ఉంది. అయితే, అక్కడి యువతలో నిరుద్యోగానికి సంబంధించిన గణాంకాలను అక్కడి ప్రభుత్వం 2018 నుంచి వరుసగా ప్రకటిస్తోంది.
ఆ ఏడాది ఇది 11.2 శాతంగా ఉండగా.. తాజాగా అది 20 శాతానికి చేరుకుంది. జులైలో చదువు పూర్తిచేసుకున్న కోటి మందికిపైగా పట్టభద్రులు జాబ్ మార్కెట్లోకి రానుండటంతో ఇది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.చైనా యువతలో నిరుద్యోగిత రేటు పెరగడంతో, దేశంలోని అత్యంత సంపన్న ప్రావిన్స్‌గా ఉన్న గ్వాంగ్డాంగ్(Guangdong) 300,000 మంది నిరుద్యోగ యువకులను రెండు మూడు సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతాలకు ఉద్యోగం కోసం పంపేందుకు అత్యంత వివాదాస్పద పరిష్కారాన్ని అందించిందని ఒక మీడియా నివేదిక తెలిపింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ(Economic system)ను పునరుజ్జీవింపజేసే” ప్రయత్నంలో పట్టణ యువత గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందాలని అధ్యక్షుడు జి జిన్‌పింగ్(Ji jinpiṅg) గత డిసెంబర్లో చేసిన పిలుపును అనుసరించి, మాజీ నాయకుడు మావో జెడాంగ్ (Mao Zedong) దశాబ్దాల క్రితం ప్రారంభించిన మునుపటి ప్రచారానికి ప్రతిధ్వనిగా ఈ ప్రకటన వెలువడింది. పట్టణ యువత చైనాలోని మారుమూల ప్రాంతాలకు ప్రభావవంతంగా బహిష్కరించబడ్డారు.