ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 11వ తేదీన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్ను సీబీఐ రికార్డ్ చేయనుంది. ఈ మేరకు కవితకు సీబీఐ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించింది. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటి వద్ద ప్రశ్నించనున్నట్లు తెలిపింది. కవిత విచారణ అంశం ఉదయం నుండి సస్పెన్స్‌గా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు కవిత ఇంటి వద్ద సీబీఐ కోసం వేచి చూశారు. మరోవైపు ఇప్పటికే సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు. అయితే సాయంత్రం వరకు ఈ సస్పెన్స్ కొనసాగింది. చివరకు సీబీఐ మెయిల్ ద్వారా కవితకు 11వ తేదీన రికార్డ్ చేస్తామని తెలిపింది. దీంతో సస్పెన్స్‌కు తెరపడింది.
లిక్కర్ స్కాం కేసులో డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్ లేదా ఢిల్లీలోని నివాసంలో ప్రశ్నిస్తామని సీబీఐ గతంలో నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన కవిత తాను విచారణకు సహకరిస్తానని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత తండ్రి కేసీఆర్‌తో, న్యాయ నిపుణులతో భేటీ అనంతరం తనకు ఎఫ్ఐఆర్ కాపీని, ఇతర వివరాలను పంపించాలని కవిత సీబీఐని కోరింది. ఈ వివరాలు వెబ్ సైట్లో ఉన్నట్లు సీబీఐ తెలిపింది. అయితే వెబ్ సైట్లో ఎక్కడా తన పేరు లేదని, అయినప్పటికీ విచారణకు సహకరిస్తానని, అయితే ముందుగా నిర్ణయించిన కారణాల వల్ల తాను 6వ తేదీన అందుబాటులో ఉండనని, 11వ తేదీతో పాటు మరో మూడు తేదీలు ఇచ్చి ఈ తేదీల్లో రావాలని కవిత మరో లేఖలో పంపించారు.
ఈ లేఖపై సీబీఐ సమాధానం ఇవ్వలేదు. దీంతో కవిత నేడు (6వ తేదీ) ఇంటి వద్ద ఉండిపోయారు. సీబీఐ విచారణకు వస్తుందని భావించారు. తన జగిత్యాల జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మరోవైపు సీబీఐ సాయంత్రం వరకు రాలేదు. అయితే 11వ తేదీన వస్తామని, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని ఆ తర్వాత సమాధానం ఇచ్చింది సీబీఐ.