తెలంగాణ ఆర్టీసీ(TSRTC) ప్రయాణికులకు శుభవార్త తెలియజేసింది. గ్రేటర్ పరిధిలో ప్రయాణించే బస్సుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికుల T-24 టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. అలాగే కొత్తగా సీనియర్ సిటిజన్లకు T-24 టికెట్లో రాయితీ కలిపించింది. రూ.80కే టికెట్‌ను అందిస్తుంది.
60 ఏళ్ళు పైబడిన వారికి T-24 టికెట్లో 20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డ్‌ను బస్ కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. ఈ తగ్గించిన టికెట్ ధరలు ఈరోజు నుండే అందుబాటులోకి రానున్నాయి.
మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మొదట ఆ టికెట్ ధరను రూ.120గా నిర్ణయించగా.. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆ తర్వాత T-24 టికెట్ ధరను రూ.100కి తగ్గించింది. తాజాగా సాధారణ ప్రయాణికులకు T-24 టికెట్ ధరను రూ.90 కి, సీనియర్ సిటిజన్లకు రూ.80 కి తగ్గిస్తూ టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.