తెలుగు రాష్ట్రాల్లో వి.హనుమంత రావు (V Hanumantha Rao) అదే వీహెచ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన పంచ్ లు, ఆయన హావభావాలు, వ్యవహార శైలి తెలుగు ప్రజలను ఆకట్టుకుంటాయి. అప్పట్లో నిత్యం మీడియాలో ఉంటూ హల్ చల్ చేసేవారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. మాజీ ఎంపీ. అలాంటి వ్యక్తి కోరికను తెలంగాణ మంత్రి కేటీఆర్ (KT Rama Rao) తీర్చారు. పెద్దాయన చేసిన ఉద్యమం ఫలించింది.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr BR Ambedkar) విగ్రహం ఆవిష్కృతమైంది. వీహెచ్ కోరడం.. మంత్రి కేటీఆర్ ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.
2019 ఏప్రిల్ 13వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ (Hyderabad)లోని పంజాగుట్ట చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ తర్వాత రెండు రోజులకు అక్కడే పెద్ద స్మారకం లాంటి నిర్మాణం చేపట్టారు. అంబేడ్కర్ చిత్రాలు ఉంచారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేయాలని వీహెచ్ ప్రయత్నించాడు. ఒక విగ్రహం తెచ్చి చౌరస్తాలో స్థాపించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా.. అనుమతులు లేకుండా ఆవిష్కరించారని పోలీసులు విగ్రహం తొలగించారు. పోలీస్ స్టేషన్ లో ఉంచారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వీహెచ్ ఉద్యమం చేపట్టాడు.
ఆయన కోరిక నాలుగేళ్లకు నెరవేరింది. పంజాగుట్టలో (Punjagutta) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ఏర్పాటు చేసింది. శుక్రవారం ఆ విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఆవిష్కరించారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. వీహెచ్ పోరాటం ఇన్నాళ్లకు ఫలించింది. ఆ విగ్రహానికి వీహెచ్ కూడా పూలమాల వేసి నివాళులర్పించారు.