»April 11th National Pet Day Do You Know About Ram Charan Pet Rhyme
National Pet Day: రామ్ చరణ్ పెట్ గురించి తెలుసా?
నేడు(ఏప్రిల్ 11న) జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం. మీరు పెంపుడు జంతువుల యజమాని అయితే దానితో కలిసి సరదాగా గడపండి. లేదంటే మీకు నచ్చిన శునకం లేదా పక్షి సహా ఇతర జంతువులను పెంచుకునేందుకు ఆసక్తి చూపించండి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) పెంచుకుంటున్న శునకం(rhyme) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా పలువురు పెంపుడు జంతువులను పెంచుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొంతమంది పక్షులు, ఇంకొంత మంది శునకాలు, మరికొంత మంది పిల్లులు సహా ఇతర జంతువులను కూడా దత్తతగా తీసుకుని పెంచుకుంటారు. అయితే మరి కొంత మందికి మాత్రం అసలు జంతువులు(animals) అంటేనే పడదు. అవి దగ్గరకు వస్తే చాలు చాలా దూరం పరిగెడతారు. కానీ జంతు ప్రేమికులు మాత్రం వాటిని దగ్గరగా తీసుకుని వాటిని కూడా వారి కుటుంబంలో ఒక వ్యక్తి మాదిరిగా జాగ్రత్తగా చూసుకుంటారు.
ఇలా సాధారణ వ్యక్తులే కాదు. సినిమా హీరోలు, హీరోయిన్లు కూడా జంతువుల పట్ల చాలా మక్కువ చూపుతారు. వారిలో టాలీవుడ్ నుంచి ప్రధానంగా చెప్పుకోవాలంటే మాత్రం హీరో రాం చరణ్ గురించి ప్రస్తావించాల్సిందే. చెర్రీ(Ram Charan) మంచి ఎనిమల్ లవర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మగధీర మూవీ సమయంలో ఆయన స్వయంగా గుర్రాలను పెంచుకున్నారు. అవి ఇప్పటికీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తనకు హార్స్ రైడింగ్ అంటే కూడా ఇష్టమని మనకు ఇది వరకే తెలుసు.
అంతేకాదు చెర్రీకి తన పెంపుడు శునకం రైమ్ అంటే కూడా చాలా ఇష్టం. ఇప్పటికే అనేక సార్లు రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(upasana) కలిసి పలు ప్రాంతాలకు టూర్లకు వెళ్లినా కూడా వారితోపాటు ఆ శునకాన్ని తీసుకెళుతూ ఉంటారు. ఆ క్రమంలో దానిని బుజ్జగిస్తూ, తమ ఒడిలో కూర్చోబెట్టు కుంటూ సరద సరదాగా రైమ్ తో గడుపుతాడు. పలు సందర్భాలలో ఉపాసన సైతం రైమ్ తో ఉన్న చిత్రాలు కూడా ఇది వరకే చూశాము. అంతేకాదు రామ్ చరణ్, ఉపాసన కలిసి ప్రత్యేకంగా రైమ్ కోసం ఓ ఇన్ స్టా ఖాతాను కూడా క్రియేట్ చేశారు. ఆ క్రమంలో చెర్రీ, ఉపాసన రైమ్ తో కలిసి వెళ్లిన ప్రదేశాలలో తీసిన ఫొటోలు, వీడియోలను రైమ్ ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైమ్(rhyme) ఇన్ స్టా ఖాతాలో 45 పోస్టులు చేయగా.. 58K కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు కూడా ఉండటం విశేషం.
అయితే ఈ రోజే జంతువుల గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈరోజు (ఏప్రిల్ 11) జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం(National Pet Day). ఈ నేపథ్యంలో ఈ రోజు గురించి కొన్ని విషయాలు తెలుకుందాం. ప్రజల్లో పెంపుడు జంతువుల పట్ల అవగాహన కల్పించడంతోపాటు జంతు సంరక్షణ ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకోవడానికి ప్రతి ఏటా ఈ రోజును నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని 2006లో జంతు సంక్షేమ ప్రచారకర్త కొలీన్ పైజ్ మొదట ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) పెంపుడు జంతువును కలిగి ఉండటం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలను గుర్తించే పరిశోధనలో భాగస్వామిగా ఉంది. పెంపుడు జంతువులను పెంచుకోవడం ద్వారా కార్టిసాల్, కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయి తగ్గడంతోపాటు అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.