దిల్ రాజు పక్కనే ఆయన నీడలా, ఆయన ప్రాణంలో ప్రాణంలా కదలాడే వ్యక్తి శిరీష్. వాళ్ళిద్దరూ కలగలసి చేసిన సినిమాలు, వాటి చరిత్రలు సినిమా పరిశ్రమకి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంత గొప్ప కాంబినేషన్ అది. కానీ, ఎప్పుడూ మైకు పని దిల్ రాజుగారికే అప్పజెప్పి, శిరీష్‌గారు మాత్రం సైలెంట్‌గా నిలబడిపోతారు.
ఎప్పుడూ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. సందర్భాన్ని బట్టి వాళ్ళ మాటల్లో అక్కడక్కడ మెరుపులు మెరుస్తుంటాయి. అవే హెడ్ లైన్స్ అవుతుంటాయి. కానీ ఎప్పుడూ మాట్లాడని వాళ్ళు ఒక్కసారిగా నోరువిప్పి, మాట్లాడినవి రెండుమాటలే అయినా, మాట్లాడితే అదిరిపోతుంది. ఏం మాట్లాడారు అన్నది పక్కనబెట్టి, మాట్లాడడమే గొప్ప అన్నట్టుగా అందరూ ముచ్చటపడిపోతారు. అలాటిది, మాట్లాడిన ఆ నాలుగుమాటల్లో అర్ధం, పరమార్థం గనక ఉంటే ఆ మాటల ముందు ముత్యాలు కూడా వెలవెలబోతాయి. అదే జరిగింది సంక్రాంతికి వస్తున్నాం విజయోత్సవ సభలో.
దిల్‌రాజుగారు ఏం మాట్లాడినా దమ్ముగా ఉంటుంది. సహేతుకంగా ఉంటుంది. అర్ధవంతంగా, సమర్ధవంతంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఆ స్టామినా ఉంది కాబట్టి. పైగా ఆయన సాహసయాత్రలు మామూలువి కావు. ఆయన నోటివెంట వచ్చిన ఎన్నో మాటలు శాశనాలయ్యాయి. వేదాలుగా చెలామణి అయిన సందర్భాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కానే కాదు. పక్కనే ఆయన నీడలా, ఆయన ప్రాణంలో ప్రాణంలా కదలాడే వ్యక్తి శిరీష్. వాళ్ళిద్దరూ కలగలసి చేసిన సినిమాలు, వాటి చరిత్రలు సినిమా పరిశ్రమకి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంత గొప్ప కాంబినేషన్ అది. కానీ, ఎప్పుడూ మైకు పని దిల్ రాజుగారికే అప్పజెప్పి, శిరీష్‌గారు మాత్రం సైలెంట్‌గా నిలబడిపోతారు. ఎవరు, ఎందరు ప్రోద్బలం చేసినా, ఎంత ఒత్తిడి చేసినా కూడా ఆయన మైకు వాసన కూడా చూడరు.
కానీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేద్ద హిట్ అయిన నేపథ్యంలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. కాకపోతే, దీనికి ముందు జనవరి 10న విడుదలైన గేమ్ ఛేంజర్ గట్టిగా దెబ్బ కొట్టింది దిల్‌రాజుని, శిరీష్‌ని. ఎవ్వరికీ ఏమీ కొత్తగా చెప్పనక్కర్లేని పని. అన్నీ తెలిసి తెలిసి దిల్‌రాజు, శిరీష్ చేయవలసివచ్చిన పని. ఈ దెబ్బకి ఎస్విసి పనైపోయిందని అందరూ అనుకున్నారు. కొందరు ఆశ కూడా పడ్డారు. ఇదంతా ఏమీ రహస్యంగా జరిగింది కాదు. అంతా బహిరంగంగానే జరిగింది. అందరూ అన్నీ విన్నట్టుగానే మాట్లాడుకున్నారు. కానీ చీకటి వెనుకనే వెలుగులా, మండుటెండ పక్కనే మంచులా, గేమ్ ఛేంజర్ పక్కనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చి, అశనిపాతంగాళ్ళ గూబ పగులగొట్టేసింది. 14న రిలీజైతే ఇవాళ్టికే దాదాపుగా 200 కోట్ల పై చిలుకు వసూళ్ళు చేసి, అమెరికాలో సైతం పెను తుఫాను రేపింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శిరీష్‌గారు, వాళ్ళకీ అనిల్ రావిపూడికి మధ్యన పటాస్ సినిమా నుంచి పెనవేసుకున్న అనుబంధం గురించి చెప్పారు. దాంతో అయిపోలేదు. ఆయనింకా మాట్లాడుతూ’’ అందరూ అనుకున్నారు మేం బావిలో పడ్డాం అని. కట్ చేస్తే మేం బావి పక్కనే ఉన్నాం దానికి కారణం అనిల్ రావిపూడి’’ అని చెబితే సభ దద్దరిల్లిపోవడమే కాకుండా, ఎప్పుడూ నోరే విప్పని మన శిరీష్గారేమిటి ఇంత ఘాటైన మాటని అంత లైట్‌గా చెప్పేశారు అని ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. తేరుకునే లోపు శిరీష్‌గారి మాటలు పూర్తయ్యాయి. దిల్‌రాజుగారు వెంటనే జోకీగా ‘’ రాబోయే రోజుల్లో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. మా శిరీష్‌గారే మాట్లాడతారు’’ అని అనడం కూడా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. జోకీగా అన్నా కూడా, దిల్ రాజుగారి సౌండ్ లో మాత్రం సందర్భోచితమైన పంచ్ మాత్రం ఉంది.