ఆయనకి సినిమాలు తీయడం, రిలీజ్ చేయడం పెద్ద లెక్క కాదు. వింత అంతకన్నా కాదు. కానీ అంతటి చాంపియన్‌కి కూడా ఈ మధ్యన వచ్చిన ఛాలెంజ్ మామ్మూలుది కాదు. కాకపోతే ఆయన కాబట్టి ఒత్తిడినంతటినీ తట్టుకుని నిలబడ్డారు. అదీ ఆయన గ్రేట్‌నెస్. చెప్పడానికి ఏముంది ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. అనుభవిస్తే తెలుస్తుందంటారు. జనవరి 10న రామచరణ్, శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్. మూడు రోజుల గ్యాప్‌లో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్. జనవరి 14న, సంక్రాంతి సందర్భంగా. ఈ రెండింటి నిర్మాణం ఓ పక్కన, మరో పక్కన రిలీజ్ డేట్స్ గొడవలు. ఈ పరిస్థితులన్నిటినీ అధిగమించి ఒకే ఒక్కడు, ఒక్కడే ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడే గేమ్ ఛేంజర్ అనిపించుకున్నారు. ఆయనే దిల్ రాజు. ఇంత కన్నా ఆయనకి ఉపోద్ఘాతాలు అక్కర్లేదు. అది ఆయన వైశాల్యం.
ఇటువంటి రిస్కీ సిట్యువేషన్లో దిల్‌రాజు ప్రదర్శించిన సహనం, ఓర్పు ఆషామాషీ కాదు. ఎందుకంటే గేమ్ ఛేంజర్ పెద్ద వైట్ ఎలిఫెంట్. ఐరావతం. బడ్జెట్టు విషయంలో గానీ, దాని వెనుకన పొంచి ఉన్న ప్రమాదం గానీ. గేమ్ ఛేంజర్ ఓ వైపున గడగడలాడిస్తుంటే, అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్ కూడా ఖరారు చేసుకుని కూర్చున్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 14న బొమ్మ పడిపోవాల్సిందే. అంతకన్నా గొప్ప డేట్ కూడా ఆ సినిమాకి దొరకదు. ఎందుకంటే పూర్తిగా పండగ వాతావరణం, సందడి, ఎంటర్టైన్మెంట్ వంటి ఎలిమెంట్స్‌తో రూపొందిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. పైగా, హీరో కూడా చిన్నపాటి హీరో కాదు. విక్టరీ వెంకటేష్. చాలా శ్రద్ధగా, బుద్ధిగా చేసిన సినిమా. ఈ రెండు సినిమాల మధ్యన, ఆయన ఎంత నవ్వుతూ తిరిగినా సరే, ఆయన పిరిస్థితి శాండ్ విచ్ లాగే అయిపోయింది. అయినా సరే, బలాదూర్ అన్నట్టుగా ఆయన ఖలేజాతోనే వ్యవహరించారు. దమ్మున్నోడు కదా.
ఈ పరిస్థితుల్లో రెండు రిలీజ్‌లని మేనేజ్ చేయడం బ్రహ్మతరం కూడా కాదు. ఎందుకంటే గేమ్ ఛేంజర్ సినిమాకి ఉన్నన్ని అవరోధాలు, ఆటంకాలు, అడ్డంకులు, అభ్యంతరాలు అన్నీ ఇన్నీ కావు. గేమ్ ఛేంజర్ సినిమాకి ఉన్న ఇబ్బందులు తెలిసిన పరిశ్రమ ప్రముఖులు ఒకరిద్దరు బాహాటంగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూనే ఉన్నారు. దిల్‌రాజుగారికి ముందే చెప్పాం, శంకర్‌తో సినిమా అంటే కొరివితో తల గోక్కున్నట్టేనని. లెక్కలు డొక్కలు తెలిసిన వాళ్ళయితే ఆదికి ముందునుంచే దిల్‌రాజుగారు సూప్‌లో పడిపోయారు. లేవడం కష్టం అన్నట్టుగా పెదవి విరచడం కూడా డైలీ హేబిట్ అయిపోయింది. అందరూ అన్నట్టుగానే గేమ్ ఛేంజర్ దిల్‌రాజుకి చుక్కలు చూపించింది. ఆయన కాబట్టి, గండరగండడు కాబట్టి తట్టుకుని నిలబడి రిలీజ్ చేశారు. పక్కనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్లలో పాల్గొని, హుందాగా కనిపించారు. కానీ పరిశ్రమంతా మాట్లాడుతున్నట్టుగా ఆయనకీ తెలుసు, దానికి తోడు, స్వంతంగా అనుభవిస్తున్న విషయం. ఆయనకీ వ్యక్తిగతంగా తెలిసినట్టుగా, అందరూ అన్నట్టుగా గేమ్ ఛేంజర్ దిల్ రాజుకి చేదు అనుభవాన్నే కొత్త సంవత్సరంలో అందించింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మొదటినుంచి పాజిటివ్ టాక్ ఉంటూ వచ్చింది. దానికి కారణం వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్, దిల్ రాజు నిర్మాత. దీనికున్న పాజిటివ్ బజ్ అండ్ వైబ్ దానికి ఉంది. కానీ ఎంత హిట్ అవుతుంది. ఎంత కలెక్ట్ చేస్తుంది ఎవ్వరికీ అంచనా లేదు. పాస్ అయిపోతుందనో లేదా ఓ రేంజ్ హిట్ అవుతుందనో అనుకున్నారు. కానీ సక్సెస్ మాత్రం గ్యారెంటీ అన్నదే అందరి సారాంశం. అందరి అంచనాలు, ఊహాగానాలు రెండు సినిమాలలోనూ నిజమయ్యాయి. గేమ్ ఛేంజర్ చతికిలబడిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ రోజునే టాక్ అదిరిపోయింది. ఆ ఎంటర్టైన్మెంటు, ఆ హేపీ మూడ్ సినిమాని ఎక్కడికో తీసుకెల్ళింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలలోనే కాదు తాజాగా అంటుకున్న అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంటల్ని ఆర్పుకుని మరీ చెలరేగిపోయింది. ఇటువంటి హిట్లు దిల్‌రాజు చూడనివి కావు. కానీ ఈ టైంటో ఇటువంటి హిట్ రావడం దిల్‌రాజు స్టేచర్‌కి ప్రకృతిచ్చిన పెద్ద గిఫ్ట్ ని చెప్పాలి. ఆయన గౌరవం నిలబడింది. ఆయనలో లోపం లేదు. ఎంత డబ్బంటే అంతా పెట్టారు. ఎక్కడా వెనుకాడలేదు. దమ్ముగా, ధైర్యంగా నిలబడ్డారు. జరిగిన ఘోరమైన జాప్యం, ఆగిఆగి ముందుకెళ్ళిన షూటింగులు…. అన్నీ కలిపి, చివరికి ఏ మాత్రం కొత్తగా అనిపించని కంటెంటు… వెరసి బూడిదలో పోసిన పన్నీరైంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం దిల్‌రాజు, అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబెనేషన్లో ఉన్న కమిట్మెంట్ సినిమాని ఈ రోజున శిఖరాగ్రంలో నిలబెట్టింది. దాదాపుగా రెండువందల కోట్ల పై చిలుకు బంపర్ రెవిన్యూని పల్లకీలో మోసుకొచ్చింది.
నిన్న జరిగిన విజయోత్సవ వేడుకలో అనిల్‌రావిపూడి మాట్లాడుతూ, ఇప్పుడు అందరూ అంటున్నట్టుగా అని అనగానే, దిల్‌రాజు కలుగుజేసుకుని రేపటికే అని నవ్వుతూ చెప్పడం సినిమా విజయానికి కలికితురాయిగా తళుక్కుమంది. ఇందులో మనకి అర్ధమైన తాత్పర్యం ఏంటంటే, నిర్మాతగా దిల్‌రాజు వైపునుంచి ఏ ఇబ్బంది లేదు. ఏ సమస్యా లేదు. ఆయన నిర్మాతగా ఏం కావాలంటే అది చేశారు. అభిరుచితో చేశారు. దమ్ముధైర్యంతో చేశారు. కానీ చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ అన్నట్టుగా, డైరెక్టర్ శంకర్ అది నిలబెట్టుకోలేకపోయారు. అనిల్ రావిపూడి నిలబెట్టుకున్నారు. దిల్‌రాజు లెవెల్‌ని నిలబెట్టారు. ఏదైనా దిల్‌రాజు టేస్ట్ అండ్ ట్రెండ్ చెక్కుచెదరలేదు. మళ్ళీ ఆయన జెండాయే ఎగిరింది. ఎప్పటికీ ఎగురుతూనే ఉంటుంది.