యువతకు ఉద్యోగాలు రావాలంటే సైకో పోయే సైకిల్ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పైన ఆయన నిప్పులు చెరిగారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నారని ఎద్దేవా చేశారు. కష్టజీవులైన గాండ్ల కులస్తుల సమస్యలు పరిష్కారిస్తామన్నారు.
టీడీపీ అధికారంలోకి రావడానికి అందరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. సీఎం బయటకు వస్తే పరదాల మాటున ఉంటున్నాడని, ప్రజలని చూస్తే ఆయనకు భయం వేస్తోందని, సీబీఐని చూస్తే ఇంకా ఎక్కువ భయపడుతున్నాడన్నారు. యువతకు భవిష్యత్ బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా సైకో పోయి.. సైకిల్ రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక మైనార్టీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించడం లేదన్నారు. దుల్హన్, రంజాన్ తోఫా, విదేశీ విద్యను జగన్ రద్దు చేశారని ఆరోపించారు. ముస్లింలను ప్రయోజకులను చేయడానికే చంద్రబాబు విదేశీ విద్య ప్రవేశపెడితే.. జగన్ అధికారంలోకి వచ్చాక రద్దు చేశారన్నారు. ముస్లింలకు జరిగిన అన్యాయంపై ఉప ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.