ప్రస్తుతం నిమ్మకాయ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో అరడజను నిమ్మకాయలు రూ.20కి దొరికేవి. కానీ ఇప్పుడు వ్యాపారులు ఒక్కో నిమ్మకాయను రూ.10కి విక్రయిస్తున్నారు. నిమ్మకాయ ధరలు చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు.
Lemon: వేసవి కాలం వచ్చేసింది. వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి చాలామంది ఎక్కువగా చల్లటి పానీయాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలాంటి వాటిలో నిమ్మకాయ ఒకటి. ప్రస్తుతం వీటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో అరడజను నిమ్మకాయలు రూ.20కి దొరికేవి. కానీ ఇప్పుడు వ్యాపారులు ఒక్కో నిమ్మకాయను రూ.10కి విక్రయిస్తున్నారు. నిమ్మకాయ ధరలు చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం నిమ్మకాయల ఉత్పత్తి తగ్గి.. డిమాండ్ పెరిగుతోంది. వీటి ధరలు పెరగడానికి కూడా ఇదే కారణం. నిమ్మసాగు ఎక్కువగా జరిగే కర్ణాటకలో ఈ ఏడాది ఉత్పత్తి 40 శాతం తగ్గింది. ఆ రాష్ట్రంలో హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో ధరలు భారీగా పెరిగాయి.
నెల రోజుల క్రితం హోల్సేల్ మార్కెట్లో రూ.2 వేలు పలికిన 1,000 పెద్దసైజు నిమ్మకాయలకు ఇప్పుడు ఏకంగా రూ.7 వేలకుపైగా చెల్లించాల్సి వస్తున్నది. అంటే ఈ నెల రోజుల్లోనే నిమ్మకాయల ధరలు 350 శాతం పెరిగినట్టు స్పష్టమవుతున్నది. దేశంలో నిమ్మసాగు ఎక్కువగా ఏపీ, కర్ణాటక, తెలంగాణలో జరుగుతుంది. ఏటా ఏపీలో దాదాపు 7, కర్ణాటకలో 3, తెలంగాణలో 1.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చేది. రైతుల నుంచి వీటిని కొనుగోలు చేసిన వ్యాపారులు స్థానికంగా అమ్మడంతోపాటు సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై మీదుగా విదేశాలకు ఎగుమతి చేసేవారు. కానీ, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నిమ్మ దిగుబడి భారీగా తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు.